6 May, 2026 | 1:19 AM

మెతుకు సీమ కరువు తీరింది

02-09-2024 02:25 AM

జిల్లాలో 17.5 సెంటీ మీటర్ల వర్షం

ఏడుపాయల ఆలయం మూసివేత

కొట్టుకుపోయిన దూప్‌సింగ్ తండా బ్రిడ్జి

మెదక్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలోని మెదక్, కొల్చారం మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మెతుకు సీమలో కరువు తీరా వర్షం కురియడంతో చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తుం డటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో రెండు రోజులుగా 13 సెంటీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మెదక్ మండలం పాతూర్ గ్రామంలో శనివారం రాత్రి 17.5 సెం.మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదుకాగా మనోహరాబాద్ మండలంలో 3.1 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.

శనివారం జిల్లా వ్యాప్తంగా 1646.9 మి.మీటర్ల వర్షపాతం నమోదు కాగా 7.8 సెం.మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఆదివారం హవేళీఘణపూర్ మండలంలో 9 సెంటీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా మనోహరాబాద్ మండలంలో 1.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 1054.5 మి.మీటర్ల వర్షపాతం నమోదు కాగా 5 సెంటీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం ముసు రు షురూ అయి శనివారం రాత్రి భారీగా వర్షం కురువడంతో జిల్లాలో 369 చెరువులు నిండుకుండలా మారినట్లు అధికారులు తెలిపారు.

జిల్లా కేంద్రంలోని మెదక్‌లో పలు కాలనీల్లోని లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. హవేళీఘణపూర్ మండలం లోని దూప్‌సింగ్ తండా బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించడం వల్ల బ్రిడ్జి కొట్టుకుపోయింది. కాప్రాయిపల్లి, రాజ్‌పేట తండాకు మధ్యలో ఉన్న చిన్న బ్రిడ్జి కొట్టుకుపోవడంతో గ్రామానికి రాకపోకలునిలిపివేశారు. వెల్దుర్తి మండలంలో హల్దివాగు ఉధృతంగా ప్రవహి స్తుంది. ఘణపురం ప్రాజెక్టుకు వరద నీరు రావడంతో ఆలయం ముందు నుంచి ఉధృతంగా నీరు ప్రవహించడంతో జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని అధికారులు మూసివేశారు. జిల్లాలో ఏ విధమైన అత్యవసర పరిస్థితులు ఉన్నా కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూం నంబర్ 939194 2254ను సంప్రదించాలని కోరారు. అలాగే జిల్లా పోలీస్  సేవలు పొందేందుకు 8712657888 నంబర్‌ను సంప్రదించాలని ఎస్పీ ఉదయ్ కుమార్‌సూచించారు.