అప్పులు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్‌లు
- నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేక
- భార్య, పిల్లలతో సహా భర్త సూసైడ్
- జీడిమెట్ల పీఎస్ పరిధిలో విషాదం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులకు ఓ కుటుంబం బలైంది. భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి వారు చనిపోయిన అనంతరం భర్త ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకటేశ్(40).. నగరంలోని హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజులరామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో కలిసి నివాస ముం టున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడిన వెంకటేశ్ సుమారు రూ.25 లక్షల వరకు అప్పులు చేశాడు.
అయితే బెట్టింగ్‌లలో డబ్బంతా ఓడిపోవడంతో.. అప్పులు తీర్చే దారిలేక కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొదటగా భార్య వర్షిణి (33), ఇద్దరు పిల్లలు రిషికాంత్(11), విహంత్(3)కు విషం ఇచ్చి వారు చనిపోయారని నిర్ధారించుకున్న అనంతరం భర్త వెంకటేశ్.. బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






