6 May, 2026 | 2:36 AM

ఉప్పొంగిన వాగులు వంకలు

02-09-2024 02:24 AM

రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట. యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

  1. పరవళ్లు తొక్కిన ఈసీ, మూసీ నదులు
  2. నీటమునిగిన పంటలు, కూలిన ఇళ్లు
  3. తెలంగాణ, కర్ణాటక మధ్య నిలిచిన రాకపోకలు
  4. విద్యాసంస్థలకు సెలవు, ప్రజావాణి రద్దు 

మెట్రో హైదరాబాద్ నెట్వర్క్, (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. అడుగంటిన సాగునీటి ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఈసీ, మూసీ నదులు పరవళ్లు తొక్కాయి.

మొయినాబాద్ మండల పరిధిలోని వాగుకు ఇరువైపులా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శంకర్‌పల్లి మండలం లోని పొద్దుటూరులో రాకపోకలు బంద్ అయ్యాయి. వెలిజర్ల, వెల్‌జాల్ గ్రామంలో వర్షం ధాటికి రెండు ఇళ్లు కూలిపోయాయి. వెంకిర్యాల, గంగన్నగూడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొందుర్గు, నవాబ్‌పేట్ మండలాలకు రాకపోకలు స్తంభించాయి. జంట జలాశయాలైన హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట) చెరువులకు భారీగా వరద చేరుతోంది.

మరో 8 అడుగుల మేర వరదనీరు వస్తే జంట జలాశయాల గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని నారింజ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో బుచినెల్లి బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరదనీరు ప్రవహిస్తుండటంతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సింగూరు ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టులో జలకళ వచ్చింది. మంజీరానదికి వరద పోటెత్తడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మెదక్ జిల్లాలో ఘణపురం ప్రాజెక్టు, హల్దివాగు పొంగిపొర్లాయి. వరద ఉధృతికి 

సిద్దిపేట హనుమకొండ రహదారి బంద్

సిద్దిపేట, సెప్టంబరు 1 (విజయక్రాంతి): రెండు రోజులుగా సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల మధ్య రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 8గంటల వరకు 70 మీ.మీ వర్షపాతం నమోదవగా, ఆదివారం సాయంత్రం వరకు జిల్లాలో సగటున 82.38మీ.మీ వర్షపాతం నమోదైంది.కొండపాక మండ లం దుద్దెడ గ్రామంలోని వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం చుట్టు ఉన్న మట్టి కొట్టుకుపోయి అందులో చుక్కనీరు నీల్వలేకుండ పోయినవి.

దుద్దెడ బందారం గ్రామాల మధ్య గల రోడ్డుపై వర్షం నీరు ప్రవహించి రోడ్డు పూర్తిస్థాయిలో ధ్వం సమైంది. సిద్దిపేట హన్మకొండ, వరంగల్, హుస్నాబాద్ ప్రధా న రహదారి బస్వాపూర్ వద్ద రోడ్డుపై మో యతుమ్మెద వాగు ఉధృతి పెరగడం వల్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. జిల్లాలో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. జిల్లాలో అత్యవసర పరిస్థితులలో టోల్ ఫ్రీ నెంబర్ 08457 230000 కు కాల్ చేయాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కలెక్టర్ సోమవారం సెలవు ప్రకటించారు. 

ఉప్పొంగిన ఈసీ, మూసీ

రంగారెడ్డి సెప్టెంబర్ 1 (విజయకాంత్రి): రంగారెడ్డి జిల్లాలో శనివారం ఉదయం నుంచి ముసురు వానతో మొదలై ఆదివారం వర్షం దంచికొట్టింది. ఎడతెరపులే కుండా వర్షం కురుస్తుండటంతో జిల్లాలోని 27 మండలాల్లో పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్ మండలంలోని దేవునిపల్లిలో చేపలవేటకు వెళ్లిన ఎరుకల శేఖర్ (35) గల్లంతు కావడంతో.. గజ ఈతగాళ్ల సాయం తో శేఖర్ మృతదేహాన్ని వెళికితీశారు.

వెలిజర్ల గ్రామం చిన్నపాటి చెరువును తలపిస్తుంది. నియోజకవర్గంలోని బొబ్బలి చెరువు నిండుకుండలా మారింది. లోతట్టు ప్రాంతా ల్లో నివాసం ఉంటున్న ప్రజలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. జంట జలాశయాలైన హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట) చెరువులకు భారీగా వరద చేరుతుంది.  నాగర్‌గూడ ఈసీ వాగును చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిశీలించారు. పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ పరిధిలో కుంట్లూరు భూదాన్ కాలనీ లోతట్టు ప్రాంతం కావడంతో ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరింది. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్, మాడ్గుల, కడ్తాల, తలకొండపల్లి మండలాలల్లో భారీ వర్షం కారణగా చెరువులు, కుంటలు నిండా యి.

వెల్‌జాల్ గ్రామంలో చెన్నయ్య, యాస చెన్నమ్మ, చంద్రదాన గ్రామంలో యాదయ్యకు చెందిన ఇళ్లు కూలిపోయాయి. చం ద్రధన గ్రామంలో ఫీడర్ ఛానల్ పేలిపోయింది. ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వ రం, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి ప్రధాన రోడ్లపై వరద నీరను చేరింది. హయత్‌నగర్‌లోని రోడ్లపై చెట్లు కూలడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. మణికొండ మున్సిపల్ పరిధిలోని పందెం వాగు నాలా ప్రవహిస్తుండటంతో మున్సిపల్ అధికారులు రాకపోకలు నిలిపివేశారు.

జిల్లా కలెక్టర్ శశాంక ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కంట్రోల్ నెంబర్ 040 ఏర్పాటు చేశారు. జిల్లాలో అత్యధికంగా కొం దుర్గు మండలంలో వర్షం కురవగా అత్యల్పం గా అబ్దుల్లాపూర్‌మెట్‌లో వర్షం పడింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యసంస్థలకు కలెక్టర్ సోమవారం సెలవు ప్రకటించారు. అలాగే సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేశారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. అత్యవసర పనులు ఉంటేగాని బయటకు రావద్ద ని సూచించారు. ఎవరికైనా ఆస్పత్రులకు వెళ్లే అత్యవసరం ఉంటే అధికారులు తెలిపిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. వాగులు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ప్రజలు ఉండకుండా చూడాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు. 

మూసీ ఉగ్రరూపం 

యాదాద్రిభువనగిరి, సెప్టెంబరు1 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తం గా ఎడతెరపి లేకుండా వర్షాలు కరుస్తున్నాయి. వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. జిల్లాలోని అడ్డగూడూరు మండలంలో రెండు రోజుల్లో 22 సెం.మీ వర్షం కురిసింది. పోచంపల్లిలో 19 సెం.మీ, ఆలేరు, బీబీనగర్‌లో 10 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదైంది.  రాజాపేట, వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్, బొమ్మల రామారం, మోత్కూరు, యాదగిరిగుట్ట, నారాయణపూర్, మోటకొండూరు, తుర్కపల్లి తదితర మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి.

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని మూసీ పరీవాహక ప్రాంతం వరదనీటితో పొంగిపొర్లుతోంది. దీంతో బీబీనగర్ పోచంపల్లి మార్గంలో  రుద్రవెలిొ్ల జూలూ రు, వలిగొండ మార్గంలో బొల్లేపల్లి, సంగెం లో లెవల్ బ్రిడ్జిల పైనుంచి వరద నీటి మట్టం పెరిగింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. భువనగిరి మండలం బండోమారంలో పిడుగుపాటుకు గురై పాడిఆవు మృతి చెందింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురియనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.

యాదాద్రి కొండపై భక్తుల పాట్లు..

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో వర్షం కారణంగా భక్తులు త్రీవ ఇబ్బందులు పడ్డారు. శ్రావణమాసం చివరి రోజు కావడంతో స్వామివారి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వర్షంలో తడూస్తూనే స్వామివారి ఆలయానికి చేరుకోవాల్సి వచ్చింది. కొండ కింద పార్కింగ్‌లో సైతం వర్షపు నీటి కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడాల్సివచ్చింది.

తెలంగాణ - కర్ణాటక మధ్య రాకపోకలు బంద్

సంగారెడ్డి, సెప్టెంబర్ 1(విజయ క్రాంతి) :  సంగారెడ్డి జిల్లాలో శనివారం ముసురు షురూ అయి ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురువడంతో పంటలకు భారీగా నష్టం జరిగింది. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామ శివారులో ఉన్న నారింజ ప్రాజెక్టు నిండిపోవడంతో నీటిపారుదల శాఖ అధికారులు ఒక గేటు ఎత్తి వరదనీటిని దిగు వకు వదులుతున్నారు. నారింజ వరదనీటి ప్రవాహంతో బుచినెల్లి వద్ద వాగు ఉధృతిగా ప్రవహించడంతో తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల పంటలు నీటిమునిగాయి.  పటాన్‌చెరులో 65వ జాతీయ రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనాలు భారీగా నిలిపో యాయి.

ముత్తంగి ఓఆర్‌ఆర్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. సింగూర్ ప్రాజెక్టులోకి వరదనీటి ప్రవాహం పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్ట్రతో పాటు జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతంలో వర్షాలు కురవ డంతో వరద నీరు వస్తుంది. సంగారెడ్డి  పట్టణంలో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు., ఊట చెరువులు వరద నీటితో కళకళలాడుతున్నాయి. సదాశివపేట మండలంలో ఉన్న గంగాకత్వ వాగు వరద నీటితో ఉధృతిగా ప్రవహిస్తోంది.  నారింజ వాగు వరద నీటిలో సోయా, పత్తి, కంది, పెసరా, మినుముతో పాటు ఇతర పంటలు నీటమునిగాయి. సంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

వికారాబాద్‌లో రికార్డు స్థాయి వర్షం

  1. 84.9 మి.మీటర్ల వర్షపాతం
  2. పదేళ్లలో ఇదే అత్యధికం

వికారాబాద్, సెప్టెంబర్-01(విజయక్రాంతి): రెండు రోజులుగా ఎడతె రిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో  పంటలు నీట మునిగాయి. శనివారం అర్థరాత్రి కురిసిన భారీ వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లాయి. పోలీసులు, రెవెన్యూ శాఖ ముందు జాగ్రత్త చర్యగా వాగులు, వంతెనల వద్ద పహారా ఉంచారు. జిల్లాలో అతిపెద్ద కోట్‌పల్లి, లక్నాపూర్, శివసాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతున్నాయి. జిల్లాలో 10 ప్రాజెక్టులు, 536 చెరువులు ఉండగా అన్నీ ప్రాజెక్టులు, చెరువులు పూర్తి స్థాయిలో నిండినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో ప్రవహించే కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది.

బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామంలోని మహాదేవ లింగ్వేర ఆలయం పూర్తిగా నీటమునిగింది. జిల్లాలోని నవాబుపేట్ మండల పరిధిలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రజలు ఆపద సమయంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ప్రీ నెంబర్ 08416 242136 ను కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లాలో రెండు రోజుల్లోనే  84.9 మి. మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా కొడంగల్ మండలంలో 122.6 మి.మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని మండలాల్లో పంటలు నీట మునిగాయి.  జిల్లాలోని పలు మడలాల్లో ఇళ్లు కూలిపోయాయి. వికారాబాద్ జిల్లాలో పది ఇళ్లు కూలిపోయాయి.