calender_icon.png 30 July, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి నాట్లకు వలస కూలీలే దిక్కు

30-07-2025 12:21:39 AM

  1. గూడెం, లక్ష్మీపూర్, గుండారం గ్రామాలలో నివాసం
  2. రోజుకు సుమారు 5 ఎకరాల్లో నాట్లు

బెజ్జంకి, జూలై 29: బెజ్జంకి మండలంలో వరి నాట్లు ప్రారంభమైన వేళ కూలీల కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గతంలో గ్రామాల మహిళలు వరి నాట్లలో చురుకుగా పాల్గొనగా, ఇప్పుడు ఆ దృశ్యం కనిపించడం లేదు. దీంతో గత రెండుమూడేళ్లుగా రైతులు వలస కూలీలపై ఆధారపడుతున్నారు. మహారాష్ట్ర, గడ్చిరోలి, చంద్రాపూర్, బీహార్, చత్తీస్గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చి వరి నాట్లు వేస్తున్నారు.

గ్రామాల్లోని కొందరు రైతులు వీరికి పశువుల పాకలు, పాత ఇళ్ళలో వసతి కల్పిస్తున్నారు. ఒక్క ఎకరాకు రూ.5,000 నుంచి రూ.5,500 వరకు కూలీ గుత్తకు కుదుర్చుకొని రైతులకు నాట్లు వేస్తున్నారు. డిమాండ్ అధికంగా ఉన్న కొన్ని గ్రామాల్లో ఇది రూ.6,000 వరకు పెరిగింది.ఈ సారి వర్షాలు ఆలస్యంగా కురవడంతో నాట్లు ఆలస్యమయ్యాయి.

కానీ గత కొన్ని రోజులుగా వర్షాలు రావడంతో రైతులు ఒక్కసారిగా పొలాలు సిద్ధం చేసుకోవడంతో వలస కూలీల డిమాండ్ భారీగా పెరిగింది. 18 మందితో ఉన్న గ్రూప్ రోజుకు సుమారు 5 ఎకరాల్లో వరి నాట్లు వేస్తోంది. ఇక స్థానిక మహిళా కూలీలు పత్తి చేనుల్లో కలుపు తీయడం వల్ల వరి నాట్లకు వలస కూలీలే ఆధారంగా మారారు.

గత ఏడాదితో పోల్చితే ఈసారి కూలీలు ఎకరాకు రూ.500 అదనంగా తీసుకుంటున్నా, రైతులు సకాలంలో పనులు పూర్తి చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బులు పెరిగినా పర్వాలేదు, నాట్లు సకాలంలో పూర్తవ్వాలని రైతులు చెబుతున్నారు. వలస కూలీల సహాయంతో వరి నాట్లు పూర్తిచేసుకుంటూ రైతులు ఊపిరి పీలుస్తున్నారు.