calender_icon.png 31 July, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడీ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్

30-07-2025 11:10:58 AM

హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌ల ప్రమోషన్ కేసుకు సంబంధించి తనకు అందిన నోటీసుకు ప్రతిస్పందనగా నటుడు ప్రకాష్ రాజ్(Actor Prakash Raj) హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ముందు హాజరయ్యారు. ఇటీవల బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన ఈడీ, దర్యాప్తు బృందం ముందు హాజరు కావాలని ప్రకాష్ రాజ్‌కు కూడా నోటీసులు పంపింది. నటుడు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి లాయర్‌తో కలిసి వెళ్లారు. బెట్టింగ్ యాప్స్ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈడీ ఇప్పటివరకు 36 మంది సినీ ప్రముఖులకు నోటీసులు పంపింది. 

బెట్టింగ్ యాప్ కేసులో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి జూలై 23న, ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగష్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హీరో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, ప్రణీత సుభాష్, యాంకర్ శ్రీముఖి, యాంకర్ శ్యామల, యూట్యూబర్లు హర్ష సాయి, బయ్య సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నానిలతో పాటు మరికొందరు ఈ కేసులో ఉన్నారు. హైదరాబాద్–సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా, పీఎంఎల్ఏ కింద ఈడీ వీరిని విచారిస్తోంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, బెట్టింగ్ కంపెనీలపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.