21 August, 2026 | 2:11 AM

మంత్రి తుమ్మల చిత్రపటానికి క్షీరాభిషేకం..

21-08-2026 01:18 AM

ఖానాపురం  పండ్ల మార్కెట్ యార్డుకు రూ.17.72 కోట్లు నిధులు మంజూరు

రోడ్లపై పండ్ల విక్రయాలతో ఇబ్బందులకు ఊరట..

ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన యూనియన్ నాయకులు 

మీడియా సమావేశంలో ఏఎంసి చైర్మెన్ హనుమంతరావు

ఖమ్మం, ఆగస్టు 21(విజయక్రాంతి): ఖానాపురం ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ యార్డు అభివృద్ధికి రూ.17.72 కోట్ల నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పండ్ల వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. ఖానాపురం హవేలీలోని మార్కెట్ యార్డు వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ హనుమంత రావు, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అశ్రీఫ్ మాట్లాడుతూ.. మంత్రి ప్రత్యేక చొరవతో నిలిచిపోయిన మార్కెట్ యార్డు పనులు తిరిగి ఊపందుకున్నాయని తెలిపారు.

అనంతరం ఫ్రూట్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. గతంలో మార్కెట్ యార్డు నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో పండ్ల వ్యాపారులు రోడ్లపైనే వ్యాపారాలు నిర్వహిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ జానిమియా, కార్యదర్శి ఏటుకూరి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు గరగ శ్రీనివాస్ తెలిపారు.

ప్రస్తుత నిధులతో మార్కెట్ యార్డులో మొత్తం 31 అభివృద్ధి పనులు చేపట్టనున్నారని, షాపింగ్ కాంప్లెక్స్లు, ట్రేడర్స్ షాపులు, కవర్ షెడ్లు, ఎలక్ట్రానిక్ వెయింగ్ బ్రిడ్జి, రైతుల విశ్రాంతి భవనం, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు తదితర మౌలిక వసతులు కల్పించనున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, సహాయ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర రావు, కోశాధికారి ఉస్మాన్, గౌరవ సలహాదారులు అన్నపు మల్లికార్జున్, ఖాసీం, కరీం తదితరులు పాల్గొన్నారు.