31-07-2025 12:00:00 AM
సిద్దిపేట రూరల్, జూలై 30 : దశాబ్ద కాలంగా లబ్ధిదారులు రేషన్ కార్డు నోచుకోకపోవడం అత్యంత బాధాకరమని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులు అంజిరెడ్డి అన్నారు. ఇరుకోడు గ్రామంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది నిరుపేదలు రేషన్ కార్డు లేకపోవడం వల్ల 10 సంవత్సరాలుగా ప్రభుత్వ బియ్యం, సంక్షేమ పథకాలు పొందలేకపోయారని చెప్పారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అత్యంత త్వరగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిపారు.
మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు వంటి పథకాలు అమలు చేసి నిరుపేద ప్రజల గుండెల్లో నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లారెడ్డి, సదాశివరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి, రాజమహమ్మద్, దుర్గయ్య, రాజిరెడ్డి, మారెడ్డి లతా కృష్ణారెడ్డి పాల్గొన్నారు.