02-08-2025 02:44:09 PM
నాగార్జునసాగర్ కు స్వల్పంగా తగ్గిన ప్రవాహం..
26 గేట్లలో 6 గేట్లను మూసేసిన అధికారులు..
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక తగ్గడంతో 20 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు..
నాగార్జునసాగర్ (విజయక్రాంతి): నాగార్జునసాగర్(Nagarjuna Sagar)కు వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. పై నుంచి వస్తున్న వరద దృష్ట్యా అధికారులు కిందకు వదిలే నీటి పరిమాణాన్ని తగ్గిస్తూ పోతున్నారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం ఎత్తిన 26 గేట్లలో 6 మూసి 20 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, 1,98,113 క్యూసెక్కులు ఔట్ ఫ్లో 1,98,113 క్యూసెక్కులు ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి మట్టం 585.10 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుత నిల్వ సామర్థ్యం 297.7235 టీఎంసీలుగా ఉంది.
పర్యాటకుల సందడి..
పర్యాటకులు సందడి కొనసాగుతోంది. సాగర్ అందాలు చూడడానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్ జలాశయం గేట్ల ద్వారా విడుదలవుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు తమ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ పరవశిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కొందరు, ఫ్రెండ్స్ తో మరికొందరు ఇలా సాగర్ అందాలను వీక్షించేందుకు తరలివస్తున్నారు.