calender_icon.png 3 August, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్షణ చర్యల వైఫల్యం తోనే గని ప్రమాదం

02-08-2025 08:31:53 PM

యజమాన్యం తీరుపై మండిపడ్డ కార్మిక సంఘాలు..

గనిపై ఆందోళనలు..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపై చూపెట్టిన శ్రద్ధ కార్మికుల రక్షణ చర్యలపై చూపెట్టకపోవడం మూలంగానే గని ప్రమాదం జరిగి కార్మికుడు మృతి చెందాడని కార్మిక సంఘాల నాయకులు తుమ్మల రాజారెడ్డి(CITU), వాసిరెడ్డి సీతారామయ్య(AITUC)లు మండిపడ్డారు. ఏరియాలోని కెకె 5 గని గని ప్రమాదంలో కార్మికుడు రాసపల్లి శ్రావణ్ కుమార్ మృతి చెందగా అధికారుల నిర్లక్ష్యం మూలంగానే గని ప్రమాదం చోటుచేసుకుందని కార్మిక సంఘాల నాయకులు శనివారం గని పై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు తుమ్మల రాజారెడ్డి, వాసిరెడ్డి సీతారామయ్యలు మాట్లాడారు. గనుల్లోని పని ప్రదేశాల్లో కార్మికులకు రక్షణ చర్యలు మెరుగు పరచాల్సి ఉన్నప్పటికీ యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బొగ్గు ఉత్పత్తిపైనే దృష్టి సారిస్తుందని ఫలితంగా గనుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గనిలో బొగ్గు ఉత్పత్తి మెరుగు పరిచేందుకు ఎస్డీఎల్ మిషన్ల పనిగంటలు పెంచుతున్నారే తప్ప అధునాతన ఎస్డీఎల్ మిషన్లను ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు.

పనిచేయని ఎస్డిఎల్ మిషన్ల ద్వారా కార్మికులతో విధులు నిర్వహించడం మూలంగానే ప్రమాదం జరిగి కార్మికుడు మృత్యువాత పడ్డాడని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గనుల్లోని పని ప్రదేశాల్లో రక్షణ చర్యలలో భాగంగా ప్రథమ చికిత్స కిట్ బాక్సులు, స్ట్రక్చర్ అందుబాటులో ఉంచడంతో పాటు ఏరియా డిస్పెన్సరీలలో స్పెషలిస్ట్ వైద్యులను నియమించాల్సి ఉన్నప్పటికీ యజమాన్యం పట్టించు కోకుండా కేవలం బొగ్గు ఉత్పత్తి పైనే దృష్టి సారిస్తూ కార్మికుల ప్రాణాలు బలిగొంటుందని వారు యజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గని ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టి రక్షణ చర్యలు మెరుగుపరిచి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి ఎక్స్ గ్రేషియాతో పాటు అన్ని ప్రయోజనాలు కల్పిస్తూ కుటుంబ సభ్యుల్లో ఒకరికి సూటబుల్ ఉద్యోగం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ నాయకులు సలెంద్ర సత్యనారాయణ, కంది శ్రీనివాస్, సిఐటియు నాయకులు సాంబారు వెంకటస్వామి, అల్లి రాజేందర్, టీబీజీకేఎస్ నాయకులు జే రవీందర్, ఓ రాజశేఖర్, ఐఎన్టియుసి నాయకులు నరేందర్, మిట్ట సూర్యనారాయణ లు పాల్గొన్నారు.

గనిని సందర్శించిన మంత్రి వివేక్

ఇది ఇలా ఉండగా ఏరియాలోని కేకే 5 గని ప్రమాదంలో కార్మికుడు రాసపల్లి శ్రావణ్ కుమార్ మృతి చెందిన విషయం తెలుసుకొన్న మంత్రి వివేక్ ఏరియాలోని కేకే 5 గనిని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును అధికారులు తోటి కార్మికులను అడిగి తెలుసు కున్నారు. గనిలో రక్షణ చర్యల ఏర్పాట్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని  ఏరియా జీఎం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించేలా చర్యలు చేపట్టాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. సంస్థకు లాభాలే కాదు కార్మికులు ప్రాణాలు ముఖ్యమని స్పష్టం చేశారు. గనిలో కార్మికులు ఎదుర్కొంటు న్న సమస్యలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు.

త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, సింగరేణి ఉన్నతాధికారులతో కార్మికుల సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రక్షణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి నివాళులు ఆర్పించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటుగా సింగరేణి సంస్థ నుంచి అన్ని బెనిఫిట్స్ త్వరగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ నాయకులు కాంపేల్లి సమ్మయ్య , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.