02-08-2025 08:34:35 PM
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు..
జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): తమను గల్ఫ్ కు పంపిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని నకిలీ వీసా టికెట్లు ఇచ్చాడని ఆరోపిస్తూ గల్ఫ్ బాధితులు శనివారం జగిత్యాల విజయపురిలోని గల్ఫ్ ఏజెంట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా ఎడిపల్లికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఒక్కొక్కరి నుండి 2 లక్షల చొప్పున 10 లక్షలు వసూలు చేసి గల్ఫ్ కు పంపకుండా ఏజెంట్ చేతులెత్తేసాడని బాధితులు ఆరోపించారు.
తమకు నకిలీ వీసా టికెట్లు అంటగట్టాడని తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడిగితే తమపైనే దాడికి పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఊరిలో ఉపాధి లేక గల్ఫ్ వెళ్లి కుటుంబాన్ని పోషించుకుందామని భావించి అప్పు సప్పు చేసి గల్ఫ్ ఎజెంట్ చేతిలో డబ్బులు పెడితే తమను మోసగించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు తమకు ఇవ్వకుంటే ఆత్మహత్యే శరణ్యమన్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. బాధితుల గోడు విన్న ఎస్పీ అశోక్ కుమార్ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ సూచన మేరకు బాధితులు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.