calender_icon.png 7 September, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంప్రదాయాలను పాటిస్తూ పండుగలను జరుపుకోవాలి

05-09-2025 01:57:24 PM

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అన్నారు. వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పాత పట్టణంలోని హనుమాన్ పురాలో ఏర్పాటు చేసిన 1 నంబర్ వినాయక విగ్రహానికి మంత్రి పూజాధిక్యాలు నిర్వహించి గణేష్ శోభ యాత్రను ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... నల్గొండ జిల్లాలో గడచిన 30 సంవత్సరాల నుండి ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను, నిమజ్జనాన్ని నిర్వహించుకోవడం సాంప్రదాయంగా వస్తున్నదని అన్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే శాంతియుత వాతావరణంలో వినాయక శోభాయాత్ర, నిమజ్జనం నిర్వహించాలని యువతకు సూచించారు. ప్రత్యేకించి యువకులు ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని కోరారు.

నల్గొండ పట్టణంలో మతసామరస్యంతో పాటు, అన్ని మతాలను గౌరవిస్తూనే అభివృద్ధిని కొనసాగిస్తున్నామన్నారు. 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని మొదలుపెట్టామని, లతీఫ్ సాహెబ్ దర్గా గుట్ట, బ్రహ్మంగారి గుట్టలకు 150 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్లు నిర్మిస్తున్నామని, 30% పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ఈ సంవత్సరం వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్తును ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, నల్గొండ ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కర్నాటి యాదగిరి, వక్త వెంకట్ నివాస్, చింత సాంబమూర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మాజీ జెడ్పిటిసి, లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.