05-09-2025 05:38:28 PM
సర్వేపల్లి రాధాకృష్ణ సేవలు మరువలేనివి
రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): దేశాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.
సమాజంలో అమ్మా, నాన్నల తర్వాత స్థానం గురువుకి ఇచ్చారని, గురువు గొప్పతనాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దేశానికి బాగా చాటి చెప్పారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. అంధకారాన్ని తొలగించి అజ్ఞానం స్థానంలో జ్ఞానాన్ని బోధించే గొప్ప వ్యక్తి గురువని అన్నారు. అలాంటి గురువుల ద్వారా సమాజానికి అవసరమయ్యే భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుందని అన్నారు.
తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలోనే పోటీపడే విధంగా ఒక్కొక్కటి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, మొట్టమొదటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు నల్గొండలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాన్ని చేపట్టి విద్యావ్యవస్థను పటిష్టం చేశామని, పాఠశాలలు, విద్యాసంస్థలలో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహించి మెరుగైన బోధన అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.