04-08-2025 12:13:10 PM
హైదరాబాద్: ఝార్ఖండ్ ముక్తి మోర్చా (Jharkhand Mukti Morcha) అధినేత, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శిబూ సోరెన్ మృతి(Shibu Soren Passes Away) పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. శిబూ సోరెన్ మరణం జార్ఖండ్, తెలంగాణ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, జాతీయ ఫెడరల్ స్ఫూర్తికి, ఆదివాసీ సమాజానికి, తీరని లోటన్నారు. ఈ సందర్భంగా శిబూ సోరెన్ తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి వారందించిన సహకారాన్ని కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) స్మరించుకున్నారు. దేశ ఫెడరల్ స్ఫూర్తిని ప్రతిఫలించే దిశగా, శిబూ సోరెన్ చేపట్టిన జార్ఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి నింపిందని పేర్కొన్నారు.
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi) స్థాపన సమయంలో శిబూ సోరెన్ ని హైదరాబాద్‌లో జరిగిన తొలి సభకు మొదటి అతిథిగా ఆహ్వానించుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. నాటి తెలంగాణ ఉద్యమానికి వారు తెలిపిన సంపూర్ణ సంఘీభావం మర్చిపోలేనిదనీ కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన శిబూ సోరెన్, తాను ప్రారంభించిన తెలంగాణ మలి దశ ఉద్యమానికి(Telangana Mali Dasha Movement) అండగా నిలిచారని కేసీఆర్ తన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా శిబూ సోరెన్ మద్దతుగా నిలిచారని, జార్ఖండ్, తెలంగాణ ప్రజల ఉద్యమ విజయాలు, దేశ ఫెడరల్ స్ఫూర్తికి, ప్రాంతీయ, సామాజిక న్యాయానికి దిక్సూచిగా నిలిచాయని కేసీఆర్ తెలిపారు.
శిబూ సోరెన్ జేఎంఎం పార్టీ(Shibu Soren JMM Party), తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర పోషించిందనీ కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతర కాలంలో 2022లో జార్ఖండ్‌లో శిబూ సోరెన్ ని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్న విషయాన్ని కేసీఆర్(KCR) గుర్తు చేసుకున్నారు. శిబూ సోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. తండ్రిని కోల్పోయి దుఃఖ సంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(Jharkhand CM Hemant Soren)కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.