15-08-2025 02:49:31 PM
79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): పదేండ్ల గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిదిద్ది నల్లగొండను బంగారుకొండగా మార్చాలనే సంకల్పంతో నేను, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులందరం సమిష్టిగా కృషి చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. 79 వ స్వాతంత్ర వేడుకల్లో(Independence Day) భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా నుంచి విద్యాశాఖా మంత్రి గత ప్రభుత్వంలో ఉన్న విద్య గురించి పట్టించుకున్న పాపానపోలేదని ఎంతో ఖ్యాతి గడించిన మహాత్ముని పేరు మీద ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏనాడు కాలమోపలేదన్నారు. మళ్ళీ నేను స్వరాష్ట్రంలో మంత్రి అయిన తర్వాతనే యూనివర్సిటీకి పూర్వవైభవం తెచ్చేందుకు శ్రీకారం చుట్టామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండకు జరిగిన అన్యాయమే గత పదేండ్లలోనూ జరిగిందని పేర్కొన్నారు. విద్యా, వైద్యం, సాగునీరు, తాగునీటి సౌకర్యాల కల్పనలో తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు.నల్గొండ స్ఫూర్తిని, పోరాటాన్ని అణువణువు పునికిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర(Telangana State) ఏర్పాటు కోసం ఆనాడు నేనుమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన సంగతి మీ అందరి మదిలో ఉన్నదే అని తెలిపారు.ఆ పోరాటం నాకు నేనుగా చేసింది మాత్రమేకాదు, నల్లగొండ గడ్డ నేర్పిన శౌర్యం, నల్లగొండ బిడ్డలుగా మీరంతా ఇచ్చిన ధైర్యమని పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖల ద్వారా ఏర్పాటుచేసిన శకటాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం,నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఎం ఏ, ఆఫీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ,జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ ,అదనపు ఎస్పీ రమేష్, ఏసిపి మౌనిక, జిల్లా సీనియర్ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.