18-10-2025 12:01:25 AM
జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): లక్ష్మణ్ కుమార్ గత 22 నెలల పాటు ఎమ్మెల్యేగా, విప్ గా, మంత్రి గా పని చేస్తు, ధర్మపురి నియోజకవర్గం లో తట్టెడు మట్టి కూడా పోయలేదని, సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న దళిత వర్గానికి చెందిన లక్ష్మణ్ కుమార్ ఆ శాఖ పరిధిలో ఉండే దళితుల కోసం చేసిందేమీ లేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. శుక్రవారం జగిత్యాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ కుమార్ తన శాఖలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్ని సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయని, వీటిని పర్యవేక్షించే బాధ్యత మంత్రి కి లేదా అని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.
గతంలో ఎన్నడూ లేని దుస్థితి ఈరోజు చూస్తున్నామని, రెండు సంవత్సరాల నుండి బెస్ట్ అవైలబుల్ స్కూల్ బిల్లులు రాక స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను స్కూల్ నుండి బయటకు పంపించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 25 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను స్కూల్ నుండి గెంటేస్తే వారి తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో కాని, గతంలో ఎవరు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో గాని ఎప్పుడైనా ఈ దుస్థితి నెలకొందా అని ప్రశ్నించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదివితే ఎస్సీ, ఎస్టీ పిల్లలు మాత్రమే, విద్యార్థులను బయటకు పంపిస్తే వారి ఆత్మస్థైర్యం కోల్పోయి వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు.
ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లకు రు.220 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, అలాగే 600 ప్రైవేట్ గురుకుల భవనాలకు రు. 215 కోట్లు బకాయి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.10 వేల కోట్ల బకాయిల్లో రూ.600 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని తెలిపారు. గురుకుల పాఠశాలలకు కాంట్రాక్టు ద్వారా కోడి గుడ్లు చికెన్, మటన్ సరఫరా చేసే వారికి బిల్లులు రాక సరఫరా నిలిచిపోయిందని అన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రి లక్ష్మణ్ కుమార్ తన శాఖకు చెందిన సమస్యలను పట్టించుకోకుండా దళితులకే అన్యాయం చేస్తున్నాడని కొప్పుల ఆరోపించారు.ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా ఎంతో అభివృద్ధి చేశామని గొప్పగా ప్రచారం చేసుకోవడం రాష్ట్ర మంత్రులకు, ముఖ్యమంత్రి కి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వ్యక్తిగత ప్రచారాలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు.