18-10-2025 12:01:58 AM
మహబూబాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : మధ్యాహ్న భోజనంలో అన్నం సరిగా ఉడకకపోవడం, పప్పు కూరలో పప్పు సరిగా వేయకపోవడం, సాంబారులో నీళ్లు ఎక్కువగా పోయడం వల్ల తినే పరిస్థితి లేదని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఓవైపు విద్యార్థులకు నాణ్య మైన మధ్యాహ్న భోజనం అందజేస్తామని ప్రకటిస్తే ఇంకోవైపు అమలులో పూర్తిగా నిర్లక్ష్యం చూపుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నం ముద్ద నోట్లో పెట్టుకునే పరిస్థితి లేదని, పర్యవేక్షించాల్సిన ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్, అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు లేవని, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం భోజనం సరిగా లేని విషయంపై ప్రశ్నిస్తే తమను చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.