calender_icon.png 18 October, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు రాష్ట్ర బంద్

18-10-2025 01:22:01 AM

బీసీ సంఘాల జేఏసీ పిలుపు..

సహకరించాలని విజ్ఞప్తి

  1. బీసీ సంఘాల జేఏసీ పిలుపు.. బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి 
  2. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటా డిమాండ్
  3. అధికార పార్టీ కాంగ్రెస్ సహా బీజేపీ, బీఆర్‌ఎస్, వామపక్షాలు, కుల, ప్రజాసంఘాల మద్దతు
  4. బంద్‌లో పాల్గొంటున్నాం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్
  5. ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు: రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి 
  6. బీసీ జేఏసీ వెంటే మాదిగ సంఘాలు: రాష్ట్ర మాదిగ సంఘాల జేఏసీ చైర్మన్ గెల్వన్న

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో శనివారం బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు అధికార కాంగ్రెస్ పార్టీతో సహా అనేక రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీనిలో భాగంగానే బంద్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, టీజేఎస్, వామపక్షాలు, ఎమ్మార్పీఎస్, వివిధ కుల, ప్రజాసంఘాలు పాల్గొననున్నాయి.

బంద్‌కు మావోయిస్టు పార్టీ సైతం మద్దతు ప్రకటించింది. బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య, వైస్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో పలువురు నేతలు ఇప్పటికే ఆయా పార్టీలు, సంఘాల నాయకులను కలిసి బంద్‌కు మద్దతు కోరిన సంగతి విదితమే. బీసీ నేతలు అలాగే అన్నిజిల్లాలు, మండల కేంద్రాల్లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించి బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

దీంతో రాష్ట్ర బంద్ విజయవంతమవుతుందని బీసీ సంఘాల నాయకులు ధీమాగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం కోటా ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పెట్టి, ఆ తీర్మానాన్ని గవర్నర్ ద్వారా రాష్ట్రపతి వద్దకు చేరవేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బిల్లును  షెడ్యూల్‌లో చేర్చాలని బీసీ సంఘాల నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే పనిలో ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ మేరకే అసెంబ్లీలో బీసీ బిల్లుకు చట్టం చేసినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. బిల్లుకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టుకు వెళ్లడంతో రిజర్వేషన్లు పెంపునకు సంబంధించిన జీవో న్యాయస్థానం మధ్యంతర స్టే విధించింది. జీవోపై స్టే ఎత్తివేయాలని రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు.

హైకోర్టులోనే విషయం తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దీంతో బీసీ జేఏసీ నాయకులు బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర మాదిగ సంఘాల జేఏసీ కూడా బీసీ సంఘాల బంద్‌కు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ పిలిజాల గెల్వన్న మాదిగ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీల జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా ఇవ్వాల్సిందేనని, అందుకు బీసీ సంఘాలకు మద్దతుగా తాము బంద్‌లో పాల్గొంటాయని స్పష్టం చేశారు. 

బంద్‌లో పాల్గొంటున్నాం..

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్

 బీసీ సంఘాలిచ్చిన బంద్ పిలుపునకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. తనతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు అవుతారనిఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికా రంలో ఉన్నప్పటికీ, బీసీల కోసం ఉన్నతంగా ఆలోచించి బంద్‌లో పాల్గొంటున్నామని స్పష్టం చేశారు. బీసీకోటా అమ లుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. బీసీ బిల్లును అడ్డుకునే వారు సైతం బంద్‌లో పాల్గొంటున్నారని, అయినా.. తాము పెద్ద మనసుతో బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

బంద్‌కు ఉద్యోగుల జేఏసీ మద్దతు 

రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఇచ్చిన బంద్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి స్పష్టం చేశారు. బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం లచ్చిరెడ్డితోపాటు ఇతర నాయకులను కలిసి బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. లచ్చిరెడ్డిని కలిసిన వారిలో తెలంగాణ బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు రామరాజు వర్మ, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వారాల శ్రీనివాస్ తదితరులున్నారు.