18-10-2025 12:00:00 AM
రెండు సెట్లు దాఖలు చేసిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్
ఇప్పటి వరకు 63 మంది అభ్యర్థులు, 79 సెట్ల దాఖలు
హైదరాబాద్, సిటీ బ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం మరింత వేడెక్కింది. శుక్రవారం(ఐదో రోజు ) అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్, తన శ్రేణులు, పార్టీనాయకులు, ప్రజలతో భారీ ర్యాలీగా షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయానికి తరలొచ్చారు. రిటర్నింగ్ అధికారి పి.సాయిరాంకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు.
శుక్రవారం మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్లను సమర్పించారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయ సందడి తారస్థాయికి చేరింది. ఐదో రోజు కూడా చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఇప్పటి వరకు మొత్తం 63 మంది అభ్యర్థులు, 79 సెట్ల నామినేషన్లను వేశారు. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది.