14-11-2025 03:32:07 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో( Jubilee Hills by-election) కాంగ్రెస్ పార్టీ గెలుపును గ్రామగ్రామాన సంబరాలు నిర్వహించండని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని బధనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండగా ,పేద ప్రజలకు ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రేషన్ కార్డులు, సున్నా వడ్డీ రుణాలు, ఉద్యోగాలు , రుణమాఫీ, రైతు భరోసా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ గెలుపు ను ప్రతి కార్యకర్త తమ గెలుపుగా భావించి సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజాపాలనలో జరుగుతున్న స్పష్టమైన మార్పుకు, వేగవంతమైన అభివృద్ధికి ప్రజలు మద్దతు తెలిపారని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీతోనే పురోగతి సాధ్యమని మరోసారి ప్రజలు రుజువు చేశారని పొన్నం ప్రభాకర్ అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బడుగు బలహీన వర్గాల బిడ్డగా, విద్యావంతుడిగా, స్థానిక ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడిని నమ్ముకొని గెలిపించుకుందన్నారు. ఇది ప్రజల ఆశలు, నమ్మకాలు, అభిలాషలకు వచ్చిన చారిత్రక విజయం అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయంతో ప్రజాపాలనలో జరుగుతున్న జూబ్లీహిల్స్ అభివృద్ధి పథాన్ని మరింత బలపరచాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.