14-11-2025 03:18:08 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై(Jubilee Hills by-election) ఎన్నికల కమిషన్ అధికారిక ప్రకటన చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్‌కు 74,259 ఓట్లు.. బీజేపీకి 17,061 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav) విజయం సాధించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటేసి గెలిపించిన అందరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. విజయం సాధించిన సందర్భంగా నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని చెప్పారు. బస్తీ పిల్లోడని నన్ను గెలిపించారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ కార్యకర్తలకు నవీన్ యాదవ్ ధన్యవాదాలు చెప్పారు.
ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ లాగా కక్షపూరిత రాజకీయాలు ఉండవని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేకనే ప్రచారంలో చెప్పుకోలేదని విమర్శించారు. కేవలం నా గురించి దుష్ప్రచారం చేసి గెలివాలని బీఆర్ఎస్ చూసిందన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఇక అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. నా పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపిచారు. అభివృద్ధే ఎజెండాగా మేం పనిచేస్తామన్నారు. బెరిస్తే ఓట్లు పడతాయా? వాళ్లే మమ్మల్ని బెదిరించారని నవీన్ యాదవ్ పేర్కొన్నారు. ఏ జమానాలో ఉన్నం.. రౌడీయిజం ఎక్కడుందన్నారు. బెదిరిస్తే ప్రజలు ఓటేసే రోజులు ఎప్పుడో పోయాయని చెప్పారు. జూబ్లీహిల్స్ ఓ మోడల్ గా తీర్చిదిద్దుతానని నవీన్ యాదవ్ తెలిపారు.