calender_icon.png 7 October, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ చీఫ్ నాతో మాట్లాడారు.. అదే ఫైనల్: మంత్రి పొన్నం

07-10-2025 02:25:46 PM

హైదరాబాద్: తెలంగాణ రాజకీయంలో కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam prabhakar), అడ్లూరి లక్ష్మణ్ ల మధ్య వివాదం చర్చనీయాంగా మారింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Lakshman) వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించారు. 'పీసీసీ అధ్యక్షుడు నాతో మాట్లాడారు.. అదే ఫైనల్' అని మంత్రి పొన్నం తేల్చిచెప్పారు. రహ్మత్ నగర్ భేటీలో ఏం జరిగిందో ఆయనకు వివరించానని పొన్నం తెలిపారు. మంత్రి అడ్లూరి వ్యాఖ్యలపై స్పందించనని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పార్టీ పరంగా మాకు మహేష్ గౌడ్ ఆదేశాలు శిరోధార్యం అన్నారు. అంతకు ముందు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేను మాదిగను కాబట్టే మంత్రి పదవి వచ్చిందన్నారు. నేను మంత్రి కావడం.. మా సామాజిక వర్గంలో పుట్టడం తప్పా? అని ప్రశ్నించారు. పొన్నం మాదిరిగా అహంకారంగా మాట్లాడటం రాదని సూచించారు. పొన్నం తన తప్పు తెలుసుకుంటారని అనుకున్నా.. పొన్నం మారకపోతే జరిగే పరిణామలకు ఆయనదే బాధ్యతన్నారు. 'నేను త్వరలోనే అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్'ని కలుస్తానని చెప్పారు. 'నేను పక్కన కూర్చొంటే వివేక్ సహించట్లేదు, పక్కన కూర్చొంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నారు' అని ఆయన ఆరోపించారు.

పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే, మీనాక్షికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ లేఖ రాశారు. పొన్నం తీరుపై ఫిర్యాదు చేశారు. రేపటిలోగా పొన్నం క్షమాపణలు చెప్పాలని అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంత్రుల వ్యవహారంలో పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్(Bomma Mahesh Kumar Goud) రంగంలోకి దిగారు. మంత్రులు పొన్నం, అడ్లూరితో పాటు శ్రీధర్ బాబుతో పీసీసీ చీఫ్‌ ఫోన్‌లో మాట్లాడారు. నేతలు సంయమనం పాటించాలని సూచించారు. అడ్లూరిపై మంత్రి పొన్నం కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అడ్లూరిని ఉద్దేశించి తాను మాట్లాడలేదని మంత్రి పొన్నం(Minister Ponnam) ఇదివరకే వివరణ ఇచ్చారు. విభేదాలను పక్కనపెట్టి అడ్లూరిపొన్నం కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నానని మహేష్ గౌడ్ తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌తో బుధవారం నాడు పీసీసీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని మంత్రులను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆదేశించారు. మంత్రి శ్రీధర్‌బాబుతో మాట్లాడిన పీసీసీ చీఫ్‌ ఇద్దరితో మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగించాని కోరారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు కాంగ్రెస్ మంత్రుల పంచాయతీపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.