07-10-2025 02:11:31 PM
భారీ వరదలకు అతలాకుతమైన ఎల్లారెడ్డి నియోజకవర్గం కు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని వినతి
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, మరమ్మతు పనుల పురోగతి గురించి ఎమ్మెల్యే మదన్మోహన్ వివరించారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని మైనర్ ఇరిగేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా వాటిని తక్షణమే పునరుద్ధరించాలని సీఎంని అభ్యర్థించారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు. అదనపు ఇందిరమ్మ ఇల్లు మంజూరు వంటి అంశాలపై కూడా సవివరంగా చర్చించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, అవసరమైన నిధులను త్వరితగతిన విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు.