సింగరేణి ప్రజలు కష్టపడి పనిచేస్తే.. దేశం, రాష్ట్రంలో వెలుగులు
హైదరాబాద్: గోదావరిఖనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత యువతకు ఉపయోగపడేలా నైపుణ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. రామగుండంలో కొత్త పవర్ హౌస్ నిర్మించాలని ఎన్నో రోజులుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అడిగారని చెప్పారు. సింగరేణి ప్రజలు ఎంతో కష్టపడి పనిచేస్తేనే.. దేశం, రాష్ట్రంలో వెలుగులు ఉంటాయన్నారు. ఇవాళ రూ. 8 వేల కోట్ల విలువైన పనులను శంకుస్థాపన చేయటం సంతోషకరమన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ఆర్డీసీకి ప్రతినెల నిధులు ఇస్తున్నామన్నారు. రూరల్ టెక్నాలజీ అనే సాఫ్ట్ వేర్ సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
రూరల్ టెక్నాలజీ సంస్థ ఏర్పాటుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎంతో కృషి చేశారు. వచ్చే ఏడాదిలో వెయ్యి మందికి శిక్షణ ఇచ్చేలా రూరల్ టెక్నాలజీ సెంటర్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత తొమ్మిదిన్నరేళ్లలో రైతులు, సింగరేణి కార్మికులకు దగా జరిగిందన్నారు. చెప్పినమాట ప్రకారం ఆగస్టు 15 నాటికి రూ. 2లక్షలలోపు ఉన్న రుణాలు మాఫీ చేశామని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా మాఫీ జరగకపోతే సరి చేసి పూర్తి చేస్తామన్న మంత్రి రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది, జరగని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. రుణమాఫీ జరగలేదంటూ బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. గత తొమ్మిదిన్నరేళ్లలో రైతులు, సింగరేణి కార్మికులకు దగా జరిగిందని శ్రీధర్ బాబు గుర్తుచేశారు.






