నిండుకుండలా శ్రీశైలం, నాగార్జున సాగర్..
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన ఉన్న కర్ణాటకలో కూడా వర్షలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం డ్యామ్ మొత్తం 10 గేట్లను అధికారులు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు నేరుగా నాగార్జునసాగర్ కు చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ కు ఇన్ ఫ్లో 2,86,434 క్యూసెక్కులుగా ఉండగా... ఔట్ ఫ్లో 3,48,235 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 214.3637 టీఎంసీలుగా ఉంది. కాగా ఈ సుందర జల దృశ్యాన్ని వీక్షించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. మరో వైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20 గేట్లు సైతం ఎత్తి నీటిని కిందకు వదిలేశారు.






