17-11-2025 07:41:41 PM
* రూ.121.50 కోట్లతో అభివృద్ధి పనులు
* 19న ప్రారంభించనున్న మంత్రి శ్రీధర్ బాబు
* ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
మణికొండ (విజయక్రాంతి): మణికొండ మున్సిపాలిటీలో 121.50 కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఈ నెల 19న శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే తోలుకంటి ప్రకాష్ గౌడ్ హాజరవుతారు. ఇందులో భాగంగా 18 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆధునిక నూతన మున్సిపాలిటీ భవనం, 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పందెన్ వాగు అభివృద్ధి పనులు, 3 కోట్ల 50 లక్షల రూపాయలతో రూపొందించిన క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పనులను అతిథులు ప్రారంభించి, పైలాన్ ఆవిష్కరిస్తారు.
అనంతరం నూతన మున్సిపాలిటీ భవనం ప్రాంగణంలో జరగనున్న 'ప్రజా పాలనా సభ'లో వారు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో, 19వ తేదీన జరగనున్న కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు సూచించారు.ప్రజలకు వేగవంతమైన, ఆధునిక సేవలు అందించేందుకు ఈ నూతన భవనాన్ని రూపొందించినట్లు, ఇది 19వ తేదీ నుంచే అధికారికంగా ప్రజల సేవలకు అందుబాటులోకి రానున్నట్లు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు.