17-11-2025 08:35:36 PM
కూరగాయలు అమ్ముకునే మహిళ దుర్మరణం..
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను షాక్‌కు గురిచేసింది. జీవనోపాధిగా కూరగాయలు అమ్మె ఇందిరానగర్‌కు చెందిన ముగ్దం బుచ్చవ్వ అర్ధరాత్రి ముందే లేచి ప్రతిరోజూ లాగే కష్టజీవిగా మార్కెట్‌కి బయలుదేరింది. ఉదయం 4:30 గంటల సమయంలో తంగళ్ళపల్లి గ్రామంలోని కొండా లక్ష్మణ్ రావు విగ్రహం దగ్గర రోడ్డు పక్కన నిలబడి ఉండగా, సిద్దిపేట నుండి సిరిసిల్ల వైపు వేగంగా దూసుకొస్తున్న GA.07.N.9081 కారు బుచ్చవ్వను బలంగా ఢీకొట్టింది.
ఢీకొట్టిన ఉద్ధృతి వల్ల ఆమె తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కుప్పకూలింది. అతివేగం, నిర్లక్ష్యంగా కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న బుచ్చవ్వను వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులకు ఫిర్యాదు మృతురాలు బుచ్చవ్వ భర్త ముగ్దం మల్లయ్య తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ ఉపేంద్ర చారి వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో తంగళ్ళపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.