17-11-2025 08:41:55 PM
ట్రై సిటీస్ అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రెంటాల కేశవరెడ్డి..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పరిస్థితుల్లో జీవిస్తున్న రాంనగర్ టవర్స్ అపార్ట్‌మెంట్‌కు చెందిన 75 కుటుంబాలపై మునిసిపల్ అధికారులు అకస్మాత్తుగా ఒత్తిడి తీసుకురావడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాలా మీద నిర్మాణం జరిగిందనే పేరుతో కాంపౌండ్ వాల్‌ను కూల్చివేయడానికి అధికారులు మార్కింగ్ చేయడం, ఇప్పటికే కష్టాల్లో ఉన్న కుటుంబాలకు మరింత ఇబ్బంది కలిగించింది. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సర్వే రిపోర్టులు వచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవాలని అపార్ట్‌మెంట్ వాసులు కమిషనర్, మేయర్‌లకు వినతిపత్రాలు సమర్పించారు. కమిషనర్ సానుకూలంగా స్పందించినప్పటికీ, కింది స్థాయి అధికారులు కొంతమంది స్వార్థపరులు తొందరపాటు చర్యలకు దిగి రావడంతో, కోర్టులో దాఖలైన పిటిషన్‌పై ప్రస్తుతం కూల్చివేత చర్యలపై స్టే వచ్చినది.
ఈ నిర్ణయంతో రాంనగర్ టవర్స్ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. తొందరపాటు నిర్ణయాలు ప్రజలకు నష్టమే ట్రై సిటీస్ అసోసియేషన్ హెచ్చరిక ఈ సందర్భంగా ట్రై సిటీస్ అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డా. రెంటాల కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నడుముల విజయ్‌కుమార్ లు మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితం నిర్మించబడిన అపార్ట్‌మెంట్‌లను సరిగా సర్వే చేయకుండా కూల్చివేయాలని ప్రయత్నించడం సరైనది కాదని, ఈ విధానాన్ని మార్చుకోకపోతే నివాసులకు న్యాయపరంగా పోరాడడం తప్ప మరో మార్గం ఉండదని ప్రతి కుటుంబం కోర్టు ధావనం చేయాల్సి వస్తే భారీ ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడి తప్పదని స్పష్టం చేసారు. అసోసియేషన్ ప్రతినిధులు ముక్తకంఠంతో హెచ్చరించారు. ఇలాంటి అనవసర ఇబ్బందులు నివాసితులకు కలగకుండా మునిసిపల్ వ్యవస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని అన్నారు.