30-08-2025 02:53:05 PM
యూరియా కోసం బీఆర్ఎస్ ఆందోళనలు నాటకాలు..
యూరియా కొరతకు కారణం తెలియదా?
దిగజారుడు రాజకీయాలు ఎవరి కోసం?.. మంత్రి తుమ్మల ధ్వజం
కేంద్రాన్ని ప్రశించకుండా.. మాపై విమర్శలెందుకు?
హైదరాబాద్: బీఆర్ఎస్ ఆందోళనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) స్పందించారు. యూరియా కోసం బీఆర్ఎస్ ఆందోళనలు నాటకాలంటూ తుమ్మల ధ్వజమెత్తారు. యూరియా కొరతకు కారణం రాష్ట్ర ప్రభుత్వమో.. కేంద్ర ప్రభుత్వమో తెలియదా?, యూరియా పంపిణీ కేంద్రం పరిధిలోని అంశమని తెలియదా?, దిగజారుడు రాజకీయాలు ఎవరి కోసం చేస్తున్నారు?, యూరియా కొరతపై కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా.. మాపై విమర్శలెందుకు? అని ప్రశ్నించారు. సచివాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. యూరియా కొరతపై మెరుపు ధర్నా చేశారు.
బీఆర్ఎస్ నాయకుడు కె.టి. రామారావు మాట్లాడుతూ, "గత 10 సంవత్సరాలలో ఎరువుల సంక్షోభం లేనప్పుడు, నేడు సమస్య ఎందుకు తలెత్తిందో వివరించండి. మరీ ముఖ్యంగా, తెలంగాణ ఎరువుల సంక్షోభంపై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు... సమాధానాలు ఉంటాయని, అసెంబ్లీ, కౌన్సిల్‌లో చర్చ జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాము... బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందా? ఏదైనా కాంగ్రెస్ మాఫియా పనిచేస్తుందా? తెలంగాణలో ఏం జరుగుతోంది? మాకు సమాధానాలు కావాలి." కేటీఆర్ పేర్కొన్నారు.