3 September, 2026 | 7:54 PM

అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదు : మంత్రి ఉత్తమ్

07-06-2024 | 04:08pm

భూపాలపల్లి: ఎన్నికల కోడ్ వల్ల కాళేశ్వరంపై రివ్యూ చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్ని మంత్రి ఉత్తమ్ పరిశీలించారు.  అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల పరిశీలనకు వచ్చాయని తెలిపారు. మంత్రి ఉత్తమ్ అధికారులతో కలిసి అన్నారం, సుందిళ్ల బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ. 90 వేల కోట్లుతో నిర్మించారని తెలిపిన మంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాళేశ్వరం డ్యామేజ్ అయిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండిపోయిందని విమర్శించారు.

అధికారంలోకి రాగానే నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారటీ పరిశీలన కోరామని ఉత్తమ్ సూచించారు. మేడిగడ్డ కుంగినప్పుడు నీళ్లు కిందికి వదిలితే డ్యామేజ్ ఇంతగా ఉండేది కాదని నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారటీ చెప్పిన విషయాన్ని వెల్లడించారు. ఎన్ డీఎస్ ఏ సూచనల మేరకు పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు. పనుల పురోగతిని పరిశీలించేందుకు వచ్చినట్లు మంత్రి చెప్పారు. మేడిగడ్డ, అన్నారంలో పనులు సంతృత్తికరంగా సాగుతున్నాయన్న ఆయన సుందిళ్ల బ్యారెజీ పనులు చాలా నెమ్మదిగా చేస్తున్నారని మండిపడ్డారు. సుందిళ్ల పనులు వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థలను హెచ్చరించినట్లు పేర్కొన్నారు. జ్యుడీషియల్ కమిటీ రిపోర్టు ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.