23-10-2025 08:10:54 AM
సిద్దిపేట కలెక్టరేట్ లో కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
సిద్దిపేట కలెక్టరేట్: బుధవారం సాయంత్రం ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్(Minister Gaddam Vivek) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు,సన్నబియ్యం అందజేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సిద్దిపేట జిల్లాలోనే 26 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ క్రమంగా నెరవేర్చుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోందని తెలిపారు. డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పథకాల అమలులో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి ఆదేశించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
సిద్దిపేట కలెక్టరేట్‌లో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారుల ఆవేదన
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్న లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచే వచ్చాం.. నీళ్లు కూడా ఇవ్వడం లేదు అని మహిళలు వాపోయారు. కలెక్టరేట్‌కి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావును చూసి తమ వేదన తెలిపారు.హరీష్ రావు గారు ఉన్నప్పుడు అన్నం పెట్టి చెక్కులు ఇచ్చేవారు... ఇప్పుడు చాయ్ నీళ్లు కూడా లేవు అని లబ్ధి దారులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో తులం బంగారం ఇవ్వడం లేదని కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులు మంత్రిని నిలదీశారు. బతుకమ్మ చీరలు బంద్, కేసీఆర్ కిట్ బంద్... కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే మంత్రి గడ్డం వివేక్ స్పందించి గత ప్రభుత్వం చేసిన అప్పులకు మా ప్రభుత్వం మిత్తిలు కట్టడానికే సరిపోతుందని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు కు వచ్చేది, పోయేది ఎంత అని తెలియదా అని మంత్రి వివేక్ లబ్ధి దారులకు తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు, ఎంఎల్సీ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకరాజు, ఆర్డీవోలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.