13-07-2025 11:15:34 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): మండలంలోని సిద్ధాపూర్ సమీప అటవీ ప్రాంతంలోని గుహలో కొలువుదీరిన సిద్దేశ్వరస్వామి(Sri Siddeshwara Swamy)ని దర్శించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రం నుండి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలోని పచ్చని అడవి ప్రాంతంలోని గుహలో కొలువుదీరిన సిద్దేశ్వరుడు, శివలింగం, హనుమాన్, భీముని పాదాల వద్ద భక్తులు రాత్రంతా భజన కార్యక్రమాలు నిర్వహించి, తెల్లవారుజామున నీటి గుండాలలో స్నానాలు చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. సిద్దేశ్వరుడికీ పూజలు నిర్వహిస్తే పంటలు బాగా పండుతాయని, సకాలంలో వర్షాలు కురుస్తాయని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రజల అపార నమ్మకం.
పచ్చటి అడవిలో, పక్షుల కిలకిలలు, అందమైన జలపాతాలు, నీటి గుండాలు, పర్యటకులను ఆకట్టుకునేలా అడవి అందాలు దర్శనమిస్తాయి. సిద్దేశ్వర గుహ వద్దకు వెళ్లేందుకు ప్రభుత్వం స్పందించి రహదారి మంజూరు చేసి రవాణా సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. సిద్ధప్ప గుహకు బెజ్జూర్ చింతలమానపల్లి, సిర్పూర్ టి, పెంచికల్పేట్, దహెగాం, తదితర మండలాల నుండి భక్తులు తరలివస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగేడి పల్లి మహేష్, సిర్పూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాచకొండ శ్రీ వర్ధన్, దేవాజి, మహేష్, చంద్రమౌళి, అర్చకులు సత్యనారాయణ, నిలేష్, సురేష్, విజయ్, శంకర్ భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.