13-07-2025 12:37:54 AM
‘ఏకశిల’పై పదునెట్టంపడి
కేరళ శబరిమల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏకశిలపై పదునెట్టంపడి (ఒకే రాతిశిలపై 18 మెట్లు) కలిగి ఉండి తెలంగాణ శబరిమలగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం గుర్తింపు పొందుతోంది. ఇక్కడ అయ్యప్ప భక్తులతో పాటు దాతల సహకారంతో 25 సంవత్సరాలుగా మండల పూజా కాలంలో అయ్యప్ప దీక్ష దారులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం ఇక్కడ అయ్యప్ప దేవాలయం నిర్మించాలని తలపెట్టారు. ఆ మేరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని అయ్యప్ప దేవాలయాలను పరిశీలించి ఇక్కడ వినూత్న రీతిలో దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. అయితే కేరళలోని శబరిమలలో రాతి శిలతో నిర్మించిన 18 మెట్ల మాదిరిగా ఇక్కడ ఏకశిలపై 18 మెట్లు చెక్కించాలని నిర్ణయించారు.
2022లో దేవాలయ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఏకశిలా పదునెట్టంపడి ఏర్పాటు కోసం వరంగల్ నగరం సమీపంలోని కొండపర్తి ఆర్‌వీఆర్ గ్రానైట్ సంస్థ అధినేత వెంకటేశ్వరరావు ఉచితంగా ఐదు అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తు గల భారీ ఏకశిలను విరాళంగా అందజేశారు. ఏకశిలను ఆలయ ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసి ప్రముఖ శిల్పి పొన్ను స్వామిచే ఏకశిలపై 18 మెట్లు చెక్కించారు.
అలాగే పంచలోహ విగ్రహాన్ని తమిళనాడుకు చెందిన శ్రీరామ్ కుమార్ ఇక్కడే ప్రజలు, దాతలు అందించిన బంగారు, వెండి, ఇత్తడి, కంచు, రాగి వస్తువులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బట్టీలో కరిగించి విగ్రహాన్ని మూస ద్వారా రూపొందించి అనంతరం చేతితో చెక్కి సుందరంగా రూపొందించారు. 2022 ఫిబ్రవరి 7న రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఏకశిలా పదునెట్టంపడి కి కూడా పంచలోహ విగ్రహ తాపడాన్ని చేయించారు.
ఏకశిల పదునెట్టంపడి
తెలంగాణలో ఏకశిల పదునెట్టంపడి గలిగిన అయ్యప్ప దేవాలయంగా గుర్తింపు పొంది అయ్యప్పస్వామి భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల నుంచి అయ్యప్ప భక్తులు ఇక్కడ మాల ధారణ, మాల విరమణ కార్యక్రమాలను నిర్వహిస్తుండడం విశేషం. అలాగే మండల పూజా సమయంలో 45 రోజులపాటు ప్రతిరోజు 300 మందికి పైగా అయ్యప్ప మాలదారులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ప్రతిరోజు గణపతి హోమం నిర్వహించడం, ప్రతినెల ఉత్తర నక్షత్రం సందర్భంగా మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం తో పాటు కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ప్రతి ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం విశేషం. 365 రోజులు అయ్యప్పను పూజించడం ఈ దేవాలయంలో మరో ప్రత్యేకతగా నిలుస్తోంది.
అలాగే ఆలయ ఆవరణలో 27 నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలతో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. ఏకశిలా పదునెట్టంపడి ఏర్పాటు చేయడంతో పాటు 2.40 కోట్ల వ్యయంతో అత్యంత సుందరంగా రూపొందించిన కేసముద్రం శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయం రాష్ట్రంలో ప్రత్యేకతను చాటుతోంది.
బండి సంపత్‌కుమార్, మహబూబాబాద్