24-01-2025 12:00:00 AM
ఈసారి ఇతివృత్తంగా ‘ఓటింగ్ కన్న ముఖ్యమైంది లేదు. నేను తప్పక ఓటు వేస్తాను’ అనే అంశాన్ని తీసుకొని, విస్తృత ప్రచారం చేస్తున్నారు.
రేపు జాతీయ ఓటర్ల దినోత్సవం
ప్రజాస్వామ్యానికి పునాది ఓటింగ్ ప్రక్రియ. పౌరులు తమ ఓటుహక్కును నిర్భయంగా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవడం ద్వారా దేశ సమ్మిళిత అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను నిర్వహించాలి. ఓటుహక్కు సద్వినియోగం, యువ ఓటర్ల నమోదు, నిష్పాక్షికంగా విధిగా ఓటు వేయడం, ప్రభుత్వ ఏర్పాటులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావడం లాంటి లక్ష్యాలను అవగాహన పరచడానికి ప్రతి ఏటా జనవరి 25న దేశవ్యాప్తంగా ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.
ఈసారి ఇతివృత్తంగా ‘ఓటింగ్ కన్న ముఖ్యమైంది లేదు. నేను తప్పక ఓటు వేస్తాను’ అనే అంశాన్ని తీసుకొని, విస్తృత ప్రచారం చేస్తున్నారు. 1950 జనవరి 25న భారత ప్రభుత్వం ‘భారత ఎన్నికల కమీషన్’ ఏర్పాటుకు గుర్తుగా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
భారతదేశంలో ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ (ఈవీఎం) లేదా బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పట్టణ ఓటర్ల నిరాసక్తతను తట్టి లేపడం, ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం, ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడం, ధన ప్రవాహాన్ని అదుపు చేయడం, ఎన్నికల నేరాలను తీవ్రంగా పరిగణించడం వంటివాటిపై ప్రజలలో అవగాహన కలిగించవలసి ఉంది.
ఓటరు తన ఓటుహక్కును విధిగా వినియోగించుకోవడం, ఓటింగ్ శాతాన్ని పెంచడం లాంటి లక్ష్యాల సాధనకు ఎన్నికల సంఘం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నది. ఓటుహక్కు పౌరసత్వం లాంటిది. ఓటుహక్కు ఉన్న ప్రతి పౌరుడూ విధిగా దానిని వినియోగించుకోవాలి.
అలాగే, 18 ఏండ్లు నిండిన వెంటనే యువత ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి. అందరూ బాధ్యత గల ఓటర్లుగా ప్రవర్తించడం అవసరం. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు గొడుగు పట్టిన మహానుభా వులను స్మరించుకోవడం, ‘మన ఓటు మన స్వరం’ అని నినదించడం నిరంతరం జరగాలి. ఓటరుగా గర్వపడుతూ, ఓటుహక్కు వినియోగంతో మనదైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని దేశ సమగ్రాభివృద్ధికి గట్టి పునాదులు వేద్దాం.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి