21 August, 2026 | 1:42 AM

తప్పిపోయిన ఉత్తరాఖండ్ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగింత

21-08-2026 12:00 AM

కొత్తపల్లి, ఆగస్టు 20(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన నూతనంగా నిర్మిస్తున్న వంతెన సమీపంలో ఈ నెల 3వ తేదీ సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఒక గుర్తుతెలియని మహిళ ఒంటరిగా నిలబడి ఉన్నట్లు సమాచారం అందగా, కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుముల నిరంజన్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళను సురక్షితంగా పోలీసుల ఆధీనంలోకి తీసుకొని,విచారించగా ఆమె పేరు రూపా రాథోర్ (35) అని, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉధమ్సింగ్ నగర్ జిల్లా ఖాటీమా ప్రాంతమని, భర్తతో జరిగిన గొడవ కారణంగా సుమారు నాలుగు రోజుల క్రితం ఉత్తరాఖండ్ నుంచి వివిధ వాహనాల్లో ప్రయాణిస్తూ కరీంనగర్కు చేరుకున్నట్లు తెలియజేసింది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శక్తి సదన్లో చేర్పించి, అనంతరం ఆమె తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా, గురువారం రోజున ఆమె తల్లిదండ్రులు మీరాదేవి, రామ్గోపాల్ రాథోర్ ఉత్తరాఖండ్ నుంచి కరీంనగర్కు చేరుకుని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రూపా రాథోర్ను ఆమె తల్లిదండ్రులకు సురక్షితంగా రూరల్ పోలీసులు అప్పగించారు.