calender_icon.png 26 October, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఐసీ పాలసీల దుర్వినియోగం

26-10-2025 12:00:00 AM

  1.   30 కోట్ల మంది సేవింగ్స్ పక్కదారి
  2. కేంద్ర ప్రభుత్వంపై ‘పీఏసీ’ దర్యాప్తు చేయాలి
  3. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) పాలసీదారుల సేవింగ్స్ దారి మళ్లాయని, ఎల్‌ఐసీతో కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జైరాం రమేశ్ శనివారం సంచలన ఆరోపణలు చేశారు. సేవింగ్స్ మళ్లింపై పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక అదానీ సంస్థ ను సమస్యల నుంచి బయట పడేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, ఆ కంపెనీలో ఎల్‌ఐసీతో రూ.33 వేల కోట్ల పెట్టుబ డులు పెట్టించిందని చెప్పుకొచ్చారు. ఎల్‌ఐసీ నిధులను వినియోగించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, నీతి ఆయోగ్‌కు ఏ అధికారం ఉందో దేశప్రజలకు చెప్పాలని నిలదీశారు.

గతేడాది సెప్టెంబర్‌లో గౌతమ్ అదా నీతో పాటు అతడి సహచరులు అమెరికాలో అక్కడి యంత్రాంగానికి లంచాలు ఇవ్వజూపిన సంగతి తెలిసిందేనని, అక్కడి ఒక కంపె నీపై ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి, వారి నుంచి నిధుల సేకరణకు అదానీ పూనుకున్నట్లు అభియోగాలు ఉన్నాయని గుర్తుచేశారు.

ఆ సమయంలో కేవలం నాలు గు గంటల ట్రేడింగ్‌లో ఎల్‌ఐసీ రూ.7,850 కోట్ల నష్టాన్ని చవిచూసిందని, ప్రధాని మోదీ ప్రజలు దాచుకున్న సొమ్మును తన మిత్రులకు పంచడం వల్లే ఈ పరిణామం చోటుచేసుకుందని ఆరోపించారు. అదానీ గ్రూప్ ప్రయోజనం కోసమే మోదీ ఎన్నో విమానాశ్రయాలు, ఓడరేవుల ను ప్రైవేటీకరించారని మండిపడ్డారు.