26-10-2025 12:00:00 AM
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
వాషింగ్టన్, అక్టోబర్ 25: అమెరికా అధ్యక్ష పదవి కోసం తాను మరోసారి పోటీచేసే అవకాశం లేకపోలేదని మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. తాను ఏదో ఒకరోజు దేశాధ్యక్షురాలిని అవ్వొచ్చని, భవిష్యత్తులో వైట్‌హౌస్‌లో ఓ మహిళ ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.
ఎన్నికల ప్రచార సమయంలో తాను ట్రంప్ అధికారంలోకి వస్తే, ఆయన ఫాసిస్ట్‌లా నిర్ణయాలు తీసుకుంటాడని హెచ్చరికలు చేశానని, అవి ఇప్పుడు నిజమైనవేనని నిరూపితమయ్యాయని చెప్పుకొచ్చారు. అన్నట్లే ఆయన ఫాసిస్ట్‌లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తన మనవరాళ్లు వారి జీవితకాలంలో అమెరికాలో కచ్చితంగా ఓ మహిళా అధ్యక్షురాలిని చూస్తారని జోస్యం చెప్పారు. బహుశా అది తాను కావొచ్చని కూడా చమత్కరించారు.
అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ విషయమై ఇంకా నిర్ణయమేదీ తీసుకోలేదని, కానీ.. రాజకీయాల్లో భవిష్యత్తు ఉందని ఇప్పటికీ భావిస్తున్నానని స్పష్టం చేశారు. తాను చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదని, తన కెరీర్ మొత్తాన్ని సేవలో గడిపానని, అది తన రక్తంలోనే ఉందని చెప్పుకొచ్చారు.
తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి డెమొక్రాట్ల తరఫున ఆశావహుల రేసులో వెనుకంజలో ఉన్నారనే పోల్స్ అంచనాలపైనా హారిస్ స్పందించారు. తాను అలాంటి అంచనాలను పట్టించుకోనని కొట్టిపడేశారు. ఒకవేళ పోల్స్‌ను పట్టించుకొని ఉంటే.. తాను గతంలో ఎన్నికల్లో పోటీచేసేదానినే కాదని కుండబద్దలు కొట్టారు.