03-01-2026 11:51:52 AM
హైదరాబాద్: కృష్ణా జలాల్లో తప్పులను కడిగిపారేస్తామన్న సభ్యులు ఏమయ్యారు? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని చురకలంటించారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా తీసుకున్న నిర్ణయాలపై చర్చకు సిద్ధమన్నారు. అన్ని జీవోలపై చర్చించేందుకు సిద్ధమంటే ఎందుకు రావడం లేదన్నారు. బీఆర్ఎస్ ఎందుకు సభకు రావట్లేదని ప్రభుత్వ విప్ ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాలకు ఇచ్చిన సమయాన్ని బీఆర్ఎస్ వినియోగించుకోలేదని ఆరోపించారు. స్పీకర్ సమయం ఇచ్చినా.. వాకౌట్ చేశారని మండిపడ్డారు. తాము అడుగుతున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ వద్ద సమాధానం లేదని తెలిపారు.
బీఆర్ఎస్ నేతలకు నిజాయితీ ఉంటే సభకు వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. అధికారం ఉంటేనే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీకి వస్తారా? అని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై ఎవరేం చేసింది సభలో మాట్లాడదామని సీఎం చెప్పారు. హరీశ్ రావు మైక్ ఇస్తే సబ్జెక్ట్ మాట్లాడకుండా రాజకీయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే.. బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్నారు. కేసీఆర్ కూతురు కవితే చెబుతోందని ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ భవన్ లో పీపీటీ అనేది మీ సొంత డప్పు కొట్టుకోవడానికే అన్నారు. బీజేపీ ఎన్ఆర్ఈజీఏ((Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme)) పథకానికి మహాత్మగాంధీ పేరు తీసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా బీఆర్ఎస్ పారిపోయిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Government Whip Beerla Ilaiah) అన్నారు. 2 వారాలు సమావేశాలు నిర్వహించాలన్న బీఆర్ఎస్ ఎందుకు వాకౌట్ చేసింది?, నీటి పారుదల అంశంపై చర్చించకుండా ఎందుకు పారిపోయింది? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం బయటపడుతుందని పారిపోయారని బీర్ల ఐలయ్య ఆరోపించారు.