6 August, 2026 | 2:30 AM

గురుకుల పాఠశాలలో బస చేసిన ఎమ్మెల్యే బీఎల్‌ఆర్

06-08-2026 01:45 AM

హాస్టల్ లోని వసతుల పరిశీలన, విద్యార్థులతో కలిసి భోజనం

దామరచర్ల, ఆగస్టు 5: మండల కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను మంగళవారం రాత్రి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తనిఖి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, హాస్టల్ గదులు, భోజనశాల, పరిశుభ్రత, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి విద్యా భ్యాసం, భోజనాల నాణ్యత, వసతి సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వారితో కలిసి రాత్రి హాస్టల్లో బస చేసి, వారి జీవన విధానాన్ని స్వయంగా పరిశీలించారు. బుధవారం ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే, పాఠశాల ప్రేయర్లో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి విద్యే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని క్రమశి క్షణతో చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.అనంతరం దామరచర్ల మండలంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాల ను సందర్శించి, అక్కడి విద్యార్థినులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

పాఠశాల అసెంబ్లీలో పాల్గొని ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, విద్యా సదుపాయాల గురించి వివరించారు.విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.విద్యార్థులు ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులతో మాట్లాడి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని  స్పష్టం చేశారు.