01-01-2026 12:00:00 AM
మహబూబ్ నగర్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తో కలిసి స్వామివారి దివ్య సన్నిధిలో లోక కల్యాణార్థం, ప్రజా శ్రేయస్సు కోసం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీవారి అనంత కృపతో ప్రజల జీవితాల్లో సుఖశాంతులు పరచాలని, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రతి ఇంటా వెలుగులా విరాజిల్లాలని ఆకాంక్షించారు. మహబూబ్నగర్ నియోజకవర్గం విద్య, వ్యవసాయం, ఉపాధి, మౌలిక సదుపాయాల రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించి, ప్రజలు గౌరవప్రదమైన జీవితం గడపాలని శ్రీవారి పాదాల చెంత మనస్ఫూర్తిగా వేడుకున్నట్లు తెలిపారు. శ్రీవారి దివ్య దర్శనం అనంతరం, ప్రజాసేవే పరమావధిగా భావిస్తూ, స్వామివారి ఆశీస్సులతో మరింత బాధ్యతాయుతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.