calender_icon.png 29 January, 2026 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం

29-01-2026 12:10:41 AM

ఉపాధి ఉపకరణాల పంపిణీలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

అడ్డంకులు సృష్టించే ‘చీడపురుగుల’పై ఎమ్మెల్యే ఆగ్రహం

ఆమనగల్లు, జనవరి 28(విజయక్రాంతి): వ్యవసాయం, కూలీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్న పేద వర్గాలకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవడం కల్వకుర్తి ప్రాంత ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని దేవకి గార్డెన్లో చేతన, ఉన్నతి మరియు శిక్ష (US) ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో పేదలకు ఉపాధి పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే 40 కుట్టు మిషన్లు, 12 తోపుడు బండ్లు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  సేవా దృక్పథం గొప్పదని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చేతన ఫౌండేషన్ సుమారు రూ. 50 కోట్ల రూపాయలతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. ముఖ్యంగా 2016లో స్థాపించిన యూఎస్ (US) ఫౌండేషన్ స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి సేవ చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వాలు చేయలేని కొన్ని పనులను కూ డా ఈ సంస్థలు బాధ్యతగా తీసుకుని పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించడం గొప్ప విషయమని కొనియాడారు.

రాజకీయ విమర్శలపై ఎమ్మెల్యే అసహనం

సమావేశం జరుగుతుండగా స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు కొందరు సభ్యులు నేలపై కూర్చుని నిరసన తెలపడంపై ఎమ్మెల్యే కసిరెడ్డి తీవ్రంగా స్పందించారు.‘ఇది ప్రైవేట్ కార్యక్రమం.... ఇక్కడేమి ప్రోటో కాల్ ఉంటుందని.... నన్ను పిలిస్తే మంచి కార్యక్రమం కు వచ్ఛా నని పేదలకు సేవ చేస్తుంటే సహకరించాల్సింది పోయి, ఇలా అడ్డుకోవడం భావ్యం కాదు. ’అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు’ అన్నట్లుగా కొందరు రాజకీయ నాయకులు తయారయ్యారని ఇలాంటి చీడపురుగులను పోలీసులు కఠినంగా అదుపు చేయాలి.‘ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పిసిసి సభ్యులు ఆయిల్ శ్రీనివాస్ గౌడ్, చేతనా ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్, యూఎస్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర సుధాకర్ రెడ్డి, వ్యవస్థాపకులు ఎర్ర శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ రఘుపతి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డోకుర్ ప్రభాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కేశవరెడ్డి, మాజీ ఎంపీపీ రఘురాములు పాల్గొన్నారు. అలాగే తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో శ్రీకాంత్ తదితర ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.