17-07-2025 12:09:37 AM
హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్‌ఎంపీ)లకు మద్దతుగా మాట్లాడటమే కాకుండా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణపై వైద్యులు, వైద్య సంఘాలు మండిపడ్డాయి. ఆయనే ఓ వైద్యుడై ఉండి నకిలీ వైద్యులను ప్రోత్సహించడమేంటని వివిధ వైద్య సంఘాలు, టీ జూడా ప్రశ్నించాయి.
హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌డీఏ) ఫిర్యాదు మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఇవాళ నోటీసులు జారీ చేసింది. కౌన్సిల్ సభ్యుడిని అవమానించడంతో పాటు తప్పుడు ఆరోపణలు చేయడం, నకిలీ వైద్యుల (ఆర్‌ఎంపీ)ను ప్రోత్సహించడంపై తమ నోటీసులు అందిన వారం రోజుల్లోగా హైదరాబాద్‌లోని టీజీఎంసీ కార్యాలయంలో చైర్మన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
లేదంతే తదుపరి చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని టీజీఎంసీ తెలిపింది. కాగా ప్రభుత్వ వైద్యుడిగా సేవలందించి, ఎమ్మెల్యేగా మారిన కవ్వంపల్లి ఇలా మాట్లాడి ఉండాల్సి కాదని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డా. ద్వారకనాథ్ రెడ్డి తెలిపారు. ఆయన తీరును ఖండిస్తున్నామని పేర్కొన్నారు.