18-07-2025 05:32:35 PM
అర్హులైన లబ్ధిదారులు అందరికీ రేషన్ కార్డులు
గత పది ఏళ్లలో బిఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా పేదలకు పంపిణీ చేయలేదని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి, పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, మండలాలకు చెందిన, అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఏ ఒక్క లబ్దిదారుడికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని నష్టం జరిగిందని విమర్శించారు. రేషన్ కార్డు లేకపోవడం తో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందలేదని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద ప్రజలు వినియోగించుకోలేక పోయారన్నారు. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రజలెవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అర్హులైన లబ్ధిదారులందరికీ నూతన రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.