రైతుల కోసం రంగంలోకి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు స్వయంగా లారీలను తీసుకువచ్చిన ఎమ్మెల్యే
చొప్పదండి, మే24(విజయక్రాంతి):గంగాధర మండలం మధురానగర్ వద్ద కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై లారీలను ఆపి ధాన్యం మిల్లులకు తరలించడానికి సహకరించాలని లారీ యజమానులను కోరిన ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇచ్చిన హామీని మర్చిపోకుండా కొనుగోలు కేంద్రాలపై నిత్యం పర్యవేక్షణ చేస్తూ రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
కేంద్రాల్లో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం లారీల కొరతతో మిల్లులకు తరలించడం ఇబ్బందిగా మారింది. రైతుల ఇబ్బందులను గ్రహించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వారి ఇబ్బందులను తీర్చడానికి స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాకు సమీపంలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై వెళుతున్న లారీలను మంగపేట చెక్పోస్ట్ వద్ద ఎమ్మెల్యే ఆపారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపుకు సహకరించాలని లారీల యజమానులతో మాట్లాడారు.
అంతేకాకుండా తానే లారీలో కూర్చుని స్వయంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లారు. లారీ లోడింగ్ తర్వాత మిల్లులకు తరలించిన వెంటనే అన్లోడ్ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా నిత్యం చొప్పదండి నియోజకవర్గం లోని కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి పర్యవేక్షిస్తూ రైతుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.






