సీఎంను కలిసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, మార్చి 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తనను ప్రభుత్వ విప్గా నియమించినందుకు ముఖ్యమంత్రి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని, అసెంబ్లీలో ప్రభుత్వ విధానాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లడంలో తన వంతు పాత్రను నిబద్ధతతో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహబూబ్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు.
ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్య రంగాల పురోగతిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వ విప్గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, శాసనసభ ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, విజయ రామారావు , వేముల వీరేశం, శాసనమండలి ప్రభుత్వ విప్ లు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, తదితరులు పాల్గొన్నారు.




