24-10-2025 11:04:58 AM
రిజర్వేషన్ సాధనకై ఐక్య పోరాటాలు చేపట్టాలి..
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి
ముకరంపురా,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు పరిచే వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజి రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక కరీంనగర్ నగరంలోని కృషి భవన్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీసీల ద్రోహులు ఎవరనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించిన అంబటి జోజి రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకవైపు కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును, ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటూ ఇంకోవైపు రాష్ట్రంలో బీసీల పట్ల మొసలి కన్నీరు కారుస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా పోరాడితేనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో బీసీ సంఘాలు, అభ్యుదయవాదులు, ప్రజాతంత్రవాదులు భాగస్వాములు కావాలని కోరారు.
అసెంబ్లీలో ఏకగ్రీవంగా చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ ఆరు మాసాలు గడిచినప్పటికీ ఎటు తేల్చకుండా ఉండడంతో మంత్రివర్గం ఆర్డినెన్స్‌ను ఆమోదించి గవర్నర్‌కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబర్ తొమ్మిదిని విడుదల చేసిందన్నారు.ఆ జీవోపై హైకోర్టు స్టే విధించిందని చెప్పారు. ఆ స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే ఆ పిటిషన్‌ను తిరస్కరించిందని వివరించారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనీ, బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత ఆ పార్టీపైనే ఉందని అన్నారు.రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రజాప్రతినిధులు అడుగుతారా? అని ప్రశ్నించారు. బీసీ జేఏసీ నేతలు ఆలోచించాలనీ, కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలనీ, కేంద్రంపై పోరాడాలని సూచించారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే అనేవl విషయాన్ని అందరూ గుర్తించాలని జోజి రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన బీజేపీ పార్టీని ఎక్కడికక్కడ ప్రజల్లో ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాలు నిర్వహించాలన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.అఖిలపక్షం సహకారంతో ఢిల్లీ కేంద్రంగా ఉద్యమించాలని కోరారు. ప్రజాతంత్ర వాదులు,అభ్యుదయ సంఘాలు, బీసీ సంఘాలు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన బిజెపిని గ్రామ గ్రామాన ఎండగట్టాలన్నారు.రాబోయే ఎన్నికల్లో బిజెపి రాజకీయ సమాధి చేయాలన్నారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ పార్లమెంట్లో చట్టం చేసి రాజ్యాంగ సవరణ చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.50 శాతం పరిమితి ఎత్తేస్తే రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం కూడా ఉండదన్నారు.మతోన్మాద, రాజ్యాంగ వ్యతిరేక, బీసీ వ్యతిరేక పార్టీ బిజెపినే అన్నారు.
సమావేశం తీర్మానాలు
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేంతవరకు కేంద్ర ప్రభుత్వంపై ఆందోళన పోరాటాలు తీవ్రతం చేయాలి.రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలను బీసీ సంఘాలను కలుపుకొని ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న బిజెపి మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీల ఇండ్లు ముట్టడించాలి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ చట్టం చేసి రాజ్యాంగ సవరణ చేయాలి.భవిష్యత్ కార్యాచరణకు అనుగుణంగా పార్టీలను ప్రజాసంఘాలను బీసీ సంఘాలను కలుపుకొని గ్రామ గ్రామాన బిజెపిని ఎండగట్టాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, ఏఐఎస్బి కేంద్ర కమిటీ సభ్యుడు కె తేజ్ దీప్ రెడ్డి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. పద్మాకర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి పురమల శ్రీనివాస్,బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్, సిపిఐ నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు, టీజేఎస్ ప్రతినిధి కర్రీ సతీష్ యాదవ్,బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆది మల్లేశం పటేల్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వాణి, బీసీ సంఘం మహిళా నాయకురాలు గందె కల్పన, గంగిపల్లి అరుణ, భాగ్యలక్ష్మి, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కోనేటి నాగరాణి, కుల సంఘాల జేఏసీ చైర్మన్ జిఎస్ ఆనంద్ గౌడ సంఘం నాయకులు గుడిశాల రమేష్ గౌడ్, మంద వెంకన్న గౌడ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రజక సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్,సిపిఎం నాయకులు జి. సత్యం, అరవింద్, వినయ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు, సత్యారావు శ్రీనివాస్, వివిధ పార్టీ నాయకులు తిరుపతి భానుచందర్ మహేష్ నాగరాజ్ గంగిపల్లి సతీష్ రాజు తదితరులు పాల్గొన్నారు