22-12-2025 02:51:25 AM
రంగారెడ్డి, డిసెంబర్ 21( విజయక్రాంతి ): ప్రకృతి విపత్తులు, పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అవగాహనతో పాటు సన్నద్ధతను మరింత పెంపొందించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహకారంతో ఈనెల 22న జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న మాక్ ఎక్సర్ సైజ్ ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మాక్ ఎక్సర్ సైజ్ కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై ఆదివారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మాక్ డ్రిల్ నిర్వహణకు నిర్ణీత ప్రణాళిక, ఆయా శాఖల బాధ్యతలు, అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే చేపట్టాల్సిన తక్షణ చర్యలు, సమన్వయం, సమాచార వ్యవస్థ, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
మాక్ డ్రిల్ను ఈ నెల 22 సోమవారం నాడు నందిగామ మండలం మేకగూడ లోని నాట్కో పరిశ్రమ ఆవరణలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విపత్తులు, వరదలు, ఊహించని రీతిలో ప్రమాదాలు జరిగిన సమయంలో ఎలా స్పందించాలి, ఆస్తి, ప్రాణనష్టం నివారించేందుకు ఏవిధమైన చర్యలు తీసుకోవాలి, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనే అంశాలపై ఈ మాక్ ఎక్సర్ సైజ్ ద్వారా ప్రయోగాత్మకంగా అవగాహన కలుగుతుందని, విపత్తులను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధత ఏ మేరకు కలిగి ఉన్నామనేది అవగతం అవుతుందని అన్నారు.
మాక్ ఎక్సర్ సైజ్ ను పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. విపత్తుల పై సమాచార సేకరణ, తక్షణమే స్పందించేందుకు వీలుగా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెం: 040-23237416, 9849906949 ఏర్పాటు, సమాచార మార్పిడి, ప్రజలను అప్రమత్తం చేయడం తదితర వాటిపై కలెక్టర్ సూచనలు చేశారు. ఇది కేవలం మాక్స్ ఎక్సైజ్ మాత్రమే అని, దీని ద్వారా ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని, విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు భయపడకుండా, ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ మాక్ ఎక్సైజ్ ను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి వదంతలను ప్రచారం చేయొద్దని జిల్లా కలెక్టర్ కోరారు.