calender_icon.png 15 September, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమాన్ని మరిచిన మోదీ సర్కార్

17-08-2024 12:00:00 AM

జే. సీతారామయ్య--------------------------------

‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’, ‘ఈసు రోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయి’ అంటూ మహాకవి గురజాడ అప్పారావు అన్న మాటలు 78వ స్వా తంత్య్ర వేడుకలు ముగిసిన వేళ దేశప్రజలు గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ పక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.48,20,512 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీనిని పరిశీలిస్తే దేశంలోని పిడికెడు మంది శత కోటీశ్వరుల సంపదను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల మంది ప్రజల సంక్షేమాన్ని వదిలి వేసినట్లుందని చెప్పవచ్చు.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను గమనిస్తే దేశంలో100 కోట్లమంది ప్రజలకు కేటాయించాల్సిన నిధులన్నిటినీ అంబానీ, అదానీ వంటి సంపన్నులకు కట్టబెట్టేందుకు రూపొందించినట్లుగా అర్థమవు తున్నది. అందుకే, ఇది ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, మహిళా వ్యతిరేక, పారిశ్రామిక వ్యతిరేక బడ్జెట్‌గా చెప్పవచ్చు.

సంక్షేమానికి తగ్గుతున్న నిధులు

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి ప్రవేశపెడుతున్న బడ్జెట్లలో ప్రజాసంక్షేమానికి క్రమంగా నిధు లను తగ్గిస్తున్నది. దేశంలో 87 కోట్ల మంది పేదలకు ఉచిత బియ్యం ఇస్తున్నటు,్ల భవిష్యత్తులోనూ ఇస్తామని ఎన్ని కల ప్రచారంలో మోదీ చెప్పారు. దేశంలో రేషన్ కార్డులు లేనివారు ఎందరో ఈ లెక్కలోకి రాకుండా ఉన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఆహార సబ్సిడీకి 2022 బడ్జెట్‌లో రూ.2,72,802 కోట్లు కేటాయించగా, 2023 రూ.2,12,332 కోట్లు కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2,05,250 కోట్లు మాత్రమే కేటాయించారు.

అంటే, ఒక్క ఆహార సబ్సిడీలోనే గత మూడేళ్ల కాలంలో క్రమంగా రూ.67,552 కోట్లు తగ్గించారు. మొత్తంగా ఆహార సబ్సిడీకి 2022-- కేంద్ర బడ్జెట్‌లో 6.51 శాతం నిధులను కేటాయించగా, 2024-- 4.26 శాతం మాత్రమే కేటాయించారు. అదే విధంగా రైతుల ఎరువులకు ఇస్తున్న సబ్సిడీకి సంబంధించి 2022-- రూ.2,51,339 కోట్లు కేటాయించగా, 2023 రూ.1,88,894 కోట్లు, 2024- బడ్జెట్‌లో రూ.1,64,000 కోట్లు కేటాయించారు. ఇంతేకాక, బడా కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సాగుకోసం అప్పులు చేసిన రైతాంగానికి రూ.5 లక్షలకోట్ల పంటరుణాలు మాఫీ చేయడానికి సిద్ధంగా లేదు.

వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఇచ్చిన ప్రాధాన్యాలను గమనిస్తే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2019- 5.44 శాతం, 2020-- 5.08 శాతం, 2021-- 4.06 శాతం, 2022-- 3.84 శాతం, 2023-- 3.20 శాతం, 2024- లలో 3.15 శాతం నిధులను కేటాయించారు. మోదీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ ఎలా తగ్గించారో స్పష్టంగా అర్థమవుతుంది. దేశం లోని 145 కోట్ల మంది ప్రజల కడుపునింపే అన్నదాతలకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు ఇస్తున్న ప్రాధాన్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు.

సగం మందికే ‘పీఎం కిసాన్’ సాయం

నరేంద్ర మోదీ ప్రభుత్వం 2018లో తెచ్చిన ‘ప్రధానమంత్రి కిసాన్ యోజన’ పథకంలో 10 కోట్లమంది సభ్యులు ఉన్నారు. రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉందనే దానితో సంబంధం లేకుండా, కుటుంబంలో ఎంతమందికి పట్టా పాసు పుస్తకాలు ఉన్నాయనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఒక్కరిని మాత్రమే లెక్కగట్టి ఏటా రూ.6,000లు మూడు విడతలుగా అకౌంట్‌లో జమ చేస్తున్నది. నేడు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 47 లక్షలమంది రైతులు ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఈ లెక్కన దేశవ్యాప్తంగా రైతులను పూర్తిగా లెక్కించి వారికి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం అమలు చేయడానికి అవసరమైన నిధులను కేటాయిం చటానికి మోదీ ప్రభుత్వం పూనుకోవడం లేదు.

2018 నాటి రైతాంగ లెక్కలమీద ఆధారపడి నిధులను పెంచకుండా అన్యాయం చేస్తున్నది. జాతీయ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా 100 రోజుల పనిని గ్రామీణ ప్రాంతాలలో పనులు లేని కాలంలో కల్పించడం జరుగుతుంది. ఈ ఉపాధి హామీ పనికి దేశంలో 87 కోట్లమంది తెల్ల రేషన్ కార్డు ఉండి గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న పేద రైతులు, కూలీలు అందరూ అర్హులే. సుమారు 30 కోట్లమంది వరకు ఉపాధి హామీ పథకానికి అర్హులుగా ఉంటారు. నిజానికి వానలపై ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగం పనులను చూస్తే ఏడాదిలో కేవలం మూడు నెలలైనా పని దొరకని పరిస్థితి ఉంటుంది. అందువల్ల, 200 రోజుల వరకు కరువు పనులు చేయించాలని ప్రజలనుండి డిమాండ్ వస్తున్నది.

ఈ పథకానికి నామమాత్రంగా రూ.60 వేల కోట్లు కేటాయించారు. పథకానికి అర్హులైన వారందరికీ జాబ్ కార్డులు ఇచ్చి 100 రోజుల పని  కల్పించినా అందుకు రూ. 6 లక్షల కోట్లు అవసరమవుతుంది. పంటల బీమాకోసం పెట్టిన  పథకానికి గతంలో రూ.15 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో 400 కోట్లు తగ్గించారు. పారిశ్రామిక రంగానికి సంబంధించిన విషయాలను చూస్తే సంక్షేమాన్ని విస్మరించి కార్మికులకు నష్టం చేసే విధంగా బడ్జెట్ ఉంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా వాటిని ప్రైవేటుపరం చేసి కార్మికులకు ఉద్యోగాలు, ఉపాధి లేకుండా చేయటమే ప్రభుత్వ ఆలోచన అన్నట్లుగా అర్థమవుతున్నది. 

కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు

దేశంలో బీజేపీ 2014లో అధికారం చేపట్టి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుండి ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారు. పారిశ్రామికంగా విద్రోహకర విధానాలను మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. 39 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులకు ఉన్న కొద్దిపాటి హక్కులనూ లేకుండా చేసి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ఉపయోగపడే నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చింది. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సమ్మెలు, ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు.

కోట్లాదిమంది రైతులకు వ్యతిరేకమైన మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు పెద్దఎత్తున ఏడాదిన్నరపాటు నిరవధిక ఉద్య మాలు చేయడంతో తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. 2024 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, డా॥ స్వామి నాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధరలను కల్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ అధికారంలోకి వచ్చాక రైతులకు మనుగడ లేకుండా, వ్యవసాయ రంగాన్ని సమూలంగా నాశనం చేసే చర్యలను అమలులోకి తెచ్చారు. 

ప్రభుత్వ రంగంలో నడుస్తున్న రైల్వే, ఇన్సూరెన్స్, విద్యుత్ రంగ సంస్థలు, ఎయిర్‌లైన్స్, పోర్టులు, స్టీల్ ప్లాంట్లు, బొగ్గు పరిశ్రమలు తదితర ప్రభుత్వరంగ సంస్థలతోపాటు డిఫెన్స్ లాంటి సంస్థలను కూడా అమ్మకానికి పెడుతున్న దుస్థితి నెలకొన్నది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు అత్యంత సన్నిహితులైన అంబానీ, అదానీలు ప్రపంచ కుబేరులుగా ఎదిగిపోయారు. అంబానీ, అదానీల ఆస్తులకు సంబంధించి అక్రమ మార్గాలద్వారా మోదీ ప్రభుత్వం అండదండలతో సంపాదించిన విషయాన్ని హిండెన్‌బర్గ్ నివేదిక వివరంగా బయట పెట్టింది. దేశప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపిస్తే ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ సంస్థల ప్ర యోజనాలను ఎత్తుకొని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పూనుకోవడం దేశ ప్రజలకు నష్టం, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం.

వ్యాసకర్త ఐఎఫ్‌టీయూ 

రాష్ట్ర ఉపాధ్యక్షులు

సెల్: 9490700954