calender_icon.png 15 September, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వర్ణ పతకమా.. నన్ను క్షమించు!

17-08-2024 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

జీవితంలో కొన్ని పొరపాట్లు మనకు తెలియకుండానే జరిగిపోతాయి. తర్వాత వాటి గురించి ఆలో చించి లాభం ఉండదు. ఎంతో కష్టపడి చదువుకుని అత్యధిక మార్కులు తెచ్చుకున్న ఫలితంగా విశ్వవిద్యాలయాలు ఇచ్చే ‘స్వర్ణ పతకం’ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సమానం. దానిని ఎంత భద్రంగా, ఇంకా ప్రాణసమానంగా కాపాడుకోవాలి! కొన్నాళ్లపాటు నేను ఈ పని సమర్థవంతంగానే చేశాను. ఆ తర్వాత నాకు తెలియకుండానే అనుకోని పొరపాటు జరిగింది.  ఆనాడు నాకెంతో గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చిన నా గోల్డ్ మెడల్ ఇప్పుడు నావద్ద లేదు. స్వర్ణ పతకం గుర్తుకు వచ్చినప్పుడల్లా అపురూపమైన ఆనాటి సంఘ టనలు కొన్ని స్ఫురణకు వస్తుంటాయి. 

“మీకు ఎంఏలో గోల్డ్ మెడల్ వచ్చింది కదా! అది వుందా? ఏదీ చూపించండి. లేక, దాన్ని కరిగించి మీ ఆవిడకు ఏమైనా ఆభరణం చేయించారా?” ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు, ప్రసిద్ధ కవయిత్రి, విద్యావేత్త నాయని కృష్ణకుమారి. తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్య్ర సమరయోధుడు నాయని సుబ్బారావు కుమార్తె. ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్ ఇంటర్వ్యూకు వెళ్లిన నన్ను ఆమె ఇలా అడుగుతారని అప్పట్లో ముందే ఊహించాను. ఎందుకంటే, గోల్డ్ మెడల్ అంటే విద్యార్థులకు అంత విలువైన, ఘనమైన విషయం కనుక.

అప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసిన వారిలో ఆచార్య నాయని కృష్ణకుమారితోపాటు ఆచార్యవర్యులు శలాక రఘునాథ శర్మ, రామచంద్రం ఉన్నారు. అట్లా ఇంటర్వ్యూలో కృష్ణకుమారి మేడం నన్ను అడగడం ఒక రకంగా నాకు అనుకూలమే అయ్యింది. శుభం జరిగింది కూడ. 

“మేడమ్ గారూ! ఈ ఇంటర్వ్యూ కోసమే ఇంకా దీన్ని దాచి ఉంచాను..” అని జేబులోంచి తీసి నా స్వర్ణ పతకాన్ని చూపించాను. అప్పుడు, ఆ ఉద్యోగం నాకు వచ్చింది. జీవితానికి గొప్ప మలుపు లభించింది. 

కానీ, ఇప్పుడు ఆ స్వర్ణ పతకం ఎక్కడ? తెలియదు, నా దగ్గరైతే లేదు. నా గోల్డ్ మెడల్ నా వద్ద లేకపోవడం ఆశ్చర్యమే. ఒకవేళ అది నా దగ్గర ఉండినా, దానిని చిన్న నగగా మార్చి ఇచ్చేయడానికి నా అర్థాంగి ప్రమీల కూడా అప్పటికే లేదు. అయితే,  ఒకరోజు నా మనవరాలు సుహవ్య నా గోల్డ్ మెడల్ గురించి అడిగింది. “పోయిందమ్మా..” చెప్పాను. 

“ఎట్లా పోయింది తాతయ్యా?” అడిగింది. చెప్పిన సమాధానం నాది నాకే మంచిగనిపించలేదు. కానీ, ఏం చేయను! గతం గతః అంతే.

“ప్చ్.. ఆ పతకం ఉంటే నేను కరిగించి చెవులకు రింగులు చేయించుకునే దాన్ని కదా..” నిట్టూర్చింది నా మనవరాలు. అంత విలువైన పతకాన్ని కరిగించి, చెవి రింగులు చేయించుకోవడం నాకూ నచ్చలేదు. ఎన్నాళ్లపాటు దాన్ని భద్రంగా కాపాడుకున్నానో గతమంతా చక్కగా ఓ సినిమా రీలులా గుర్తొచ్చింది. 

మెడల్ సాధించిన విధము..

ఎంఏలో స్వర్ణ పతకం సాధించడం వెనుక నా కృషి ఎంతో ఉంది. అంత అలవోకగా వచ్చిందేమీ కాదు. నిజానికి ఎవరికీ రాదు కూడ. అప్పటికే హైస్కూలులో అధ్యాపకునిగా పనిచేస్తున్న నేను నిజాం సాయం కళాశాలలో ఎంఏ తెలుగులో విద్యార్థిగా చేరాను. ఆ కోర్సు రెండు సంవత్సరాలు, నాలుగు సెమిస్టర్లు. మొదటి సంవత్సరం అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి నాకు. ప్రసిద్ధ ఆచార్యవర్యులు గోపాల కృష్ణారావు, ముది గొండ శివప్రసాద్, ఇరివెంటి కృష్ణమూర్తి, వేటూరి ఆనందమూర్తి వంటి ఉద్ధండులంతా గురువుల స్థానంలో ఉన్నారు. వారందరి వాత్సల్యాల్ని పొందగలగడం నా అదృష్టమే.

ఒకరోజు ఇరివెంటి కృష్ణమూర్తి ఆచార్యులు “మనం సినారెను కలవాలయ్యా” అన్నారు. అప్పుడు డా॥ సి.నారాయణరెడ్డి ఆర్ట్స్ కాలేజీలో పని చేస్తున్నారు. సారు నన్నెందుకు కలవాలనుంటున్నారో అప్పటికి నాకు అర్థం కాలేదు. ఆ రోజు స్కూల్‌కు సెలవు పెట్టాను. కృష్ణమూర్తి సారుతో కలిసి ఆర్ట్స్ కాలేజీకి వెళ్లాను. సినారెను వారి ఛాంబర్‌లో నేను కలవడం అదే మొదటిసారి. కృష్ణమూర్తి సారు ఒక కుర్చీలో కూర్చున్నారు. నేను నిలబడే ఉన్నాను. 

సినారె నన్ను చూసి

“నిలబడ్డావేంటి? కూర్చో..” అన్నారు. 

నేను రెండు చేతులు చక్కగా జోడించి నమస్కరించాను. కృష్ణమూర్తి సారు పక్కన కూర్చున్నాను భయం భయంగా.

“ఏమైనా రాస్తున్నావా?” అడిగారు సినారె. 

“కూనలమ్మ పదాల ఛందస్సులో మల్లి పదాలు రాస్తున్నాను సార్‌” చెప్పాను. 

“ఏదీ, ఒక పదం వినిపించు...” అన్నారాయన. 

శ్రావ్యంగా వినిపించాను..

“చూడవచ్చిన వారు

చుట్టాలు కాబోరు

పండుటాకుల జోరు

ఎండుటకె మల్లీ!”

“ఎన్ని పదాలు రాశావు?” అడిగారు సినారె. 

“నూరు పదాలు రాశాను సార్‌” అన్నాను. 

“ఐతే, సాహిత్య అకాడమీ కార్యాలయానికి వెళ్లు. అక్కడ దేవేందర్ ఉంటాడు, అతనికి నీ పుస్తకం ఇవ్వు. పుస్తక ప్రచురణకు ఉచిత ఆర్థిక సహాయం లభిస్తుంది..” చెప్పారు నావైపు చూస్తూ. ఆ మాటలకు నాకెంతో సంతోషం కలిగింది.

‘ఇరివెంటి వారు సినారెకు నా గురించి ఇంతకు పూర్వమే చెప్పి ఉండవచ్చు. లేకపోతే, అంతటి మహాకవి నా ‘మల్లి పదాలు’ వినడం ఏంటి? వాటిని అచ్చు వేసుకోవడానికి ఆర్థిక పరమైన మార్గం చూపడం ఏమిటి?’ 

సినారె సార్ దగ్గర సెలవు తీసుకొని బయల్దేరుదామని అనుకుంటున్న సమయంలో వారు మరో శుభవార్త వినిపించారు. 

“ఇవాళ్టి నుంచి మీకు పాఠం చెప్పడానికి నేను నిజాం కళాశాలకు వస్తున్నాను..” అన్నారు. ఆ మాటలు వినగానే నా మనస్సు మరింత సంతోషంలో మునిగి పోయింది. సినారె శిష్యులమని చెప్పుకోవడం ఎంతో గౌరవం ఆనాడు. వారు ఆర్ట్స్ కాలేజీకి మాత్రమే పరిమితమైతే, వారికి శిష్యులమని చెప్పుకునే అవకాశం దొరికేది కాదు మాకు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి, కృష్ణమూర్తి సార్‌తోపాటు ఆర్ట్స్ కాలేజీ నుంచి బయటపడ్డాను. 

మొదటి సంవత్సరం నాకు అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ అప్పటిదాకా గురజాడ గోల్డ్ మెడల్ మీద అంతగా దృష్టి లేకుండా ఉండింది. సినారె వారు నాకు గురువైన తర్వాత, దాన్ని సాధించాలన్న కోరిక పెరిగింది. చివరికి ఎంఏలో గోల్డ్ మెడల్ సాధించాను. నాకు తర్వాత తెలిసింది కృష్ణమూర్తి సార్‌ద్వారా, ‘సినారె తాను గురువుగా ఉన్న శిష్యులకు గోల్డ్ మెడల్ రావాలని కోరుకుంటారని’.

నా గోల్డ్ మెడల్ నా జీవితాన్నే మార్చి వేసింది. అటు ప్రగతి మహావిద్యాలయంలో లెక్చరర్ పోస్టు ఇప్పించింది. ఆ తర్వాత విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిలో నిలిపింది. కానీ, ఇప్పటికీ గోల్డ్ మెడల్ పోయినందుకు బాధగానే ఉంది. ఒకటి రెండుసార్లు నా ధర్మపత్ని బతికి ఉన్నప్పుడు, “ఆ మెడల్ ఇవ్వండి, నేను చెవి కమ్మలు చేయించుకుంటాను..” అని అడిగింది కూడా. 

నేను ఇవ్వలేదు. నా స్వర్ణ పతకం ఎలా పోయిందో గుచ్చిగుచ్చి అడిగేసరికి, అసలు విషయం నా మనవరాలుకు చెప్పక తప్పలేదు.

“నేను అప్పుడప్పుడు రూపాయల్ని పుస్తకాల మధ్య పెడతానమ్మా. స్వర్ణ పతకాన్ని కూడా అదే అలవాటుతో ఏదో పుస్తకంలోనో, పుస్తకాల మధ్యనో పెట్టి ఉంటాను. ఎవరో నా లైబ్రరీలోకి ప్రవేశించిన వారు పుస్తకాలతోపాటు పతకాన్ని కూడా గ్రహించి ఉంటారు. దాన్ని ఇప్పటిదాకా ఎవరూ నాకు తెచ్చివ్వ లేదు...” ఇదీ నా గోల్డ్ మెడల్ కథ. 

వ్యాసకర్త సెల్: 9885654381