16-10-2025 01:59:21 AM
42 శాతం రిజర్వేషన్లపై రాజకీయం చేయొద్దు
18న జరిగే బంద్‌ను సంపూర్ణంగా బలపరుస్తున్నాం
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్ పాషా
బీసీహెచ్‌ఎస్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో నిరసన
భద్రాద్రికొత్తగూడెం, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో బిసిలకు 42శాతం రిజర్వేషన్ల అమలును కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని, రిజర్వేషన్ల అంశంపై కేంద్రం రాజకీయాలు చేయడం సరైంది కాదని, ఇలాంటి చర్యలు బిసిల పట్ల కేంద్రానికున్న వ్యతిరేక వైఖరి బహిర్గతమవుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు.
సిపిఐ అనుబంధ బిసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం బిసిహెచ్‌ఎస్, సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండు సెంటర్లో నిరసన తెలిపారు. కేంద్రం తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ తెలం గాణ ఉభయ సభలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి గవర్నరుకు ఆమోదానికి పంపారని, ఈ బిల్లును ఆమోదించి ఆర్డినెన్సు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం తొక్కి పట్టిందని ఆరోపించారు.
చట్టసభలు, అన్నివర్గాల ప్రజలు కూడా విస్తృతంగా మద్దతు తెలిపారని, ఇంత స్పష్టమైన ప్రజాభిప్రాయాన్ని కేంద్రం పట్టించు కోకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. బీసీ వర్గాలకు న్యాయం చేయడంలో మోడీ ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. బీసీల అభ్యున్నతి దేశ ప్రగతికి కీలకమని ఆయన స్పష్టం చేశారు.
42 శాతం రిజర్వేషన్ల అంశంపై రాజకీయ లాభనష్టాల కోసం ఆటలు ఆడకూడదని హెచ్చరించారు. రిజర్వేషన్ల బిల్లునుచట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కులను కాపాడే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, బీసీల హక్కుల కోసం సిపిఐ మరింత బలమైన ఉద్యమాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలను రాజకీయంగా విభజించే కుట్రలను తిప్పికొడతామని హెచ్చరిం చారు.
బిసి జేఏసీ తలపెట్టిన అక్టోబర్ 18 రాష్ట్రవ్యాప్త బంద్ను సిపిఐ సంపూర్ణంగా బలపరుస్తుందని ప్రకటించారు. బందులో అన్ని ప్రజాసంఘాలు, కార్మిక, రైతు, విద్యార్థి సంఘాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, ఎస్ కె ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు దీటి లక్ష్మీపతి, భూక్యా శ్రీనివాస్, గుత్తుల సత్యనారాయణ, నాయకులు చింతాల రాజు, గుత్తుల శ్రీనివాస్, రాంబాబు, యూసుఫ్, సత్యనారాయణాచారి, బోయిన విజయ్ కుమార్, ఏ లక్ష్మీనారాయణ, బత్తుల సురేష్, జహీర్, కుసపాటి శ్రీను, బిసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.