22 April, 2026 | 12:34 AM

రాజన్న సాక్షిగా మోదీ అబద్ధాలు

09-05-2024 02:52 AM

మోదీకి ఎన్నికల మీదనే భక్తి

కాంగ్రెస్ హయాంలోనే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అడుగులు  

మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం 

కరీంనగర్/సిద్దిపేట, మే 8 (విజయ క్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడకు వచ్చి రాజన్న సాక్షిగా అబద్ధాలు చెప్పి వెళ్లిపోయారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బుధవారం కరీంనగర్‌లో పొన్నం మీడియాతో మాట్లాడారు. ముందు మేము అడిగే ప్రశ్నలకు బీజేపీ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏదో పొడిచేసినం అని చెప్తారు.. కరీంనగర్‌కు ఏం చేశారు అని అడిగితే చెప్పరని పేర్కొన్నారు. ఇక్కడ ఏదైనా చేశామని అంటే దొరికిపోతారని, అందుకే మోదీ ఒక్క ముక్క కరీంనగర్ గురించి మాట్లాడే సాహసం చేయలేదని చెప్పారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీకి ఎన్నికల మీద భక్తి తప్ప దేవుడి మీద లేదని ఎద్దేవాచేశారు. ఒకవేళ దేవుడి మీద భక్తి ఉంటే.. ఈ పదేండ్లలో మోదీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వేములవాడ రాజన్నకు నిధులు ఇవ్వలేదని, ఆలయ అభివృద్ధికి ఎలాంటి హామీలు ఇవ్వలేదని దుయ్యబట్టారు.

రాజన్నకు కనీసం కోటి కాదు, కనీసం ఒక కోడె అన్న ఇచ్చిండా? అని ప్రశ్నించారు. ఒక్క ఓటుతో కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేశామన్న మోదీ.. అక్కడ శాంతి నెలకొన్నదా? చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా అక్కడ శాంతి నెలకొంటే బీజేపీ ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయలేదని నిలదీశారు. కశ్మీర్‌లోని మూడు లోక్‌సభ సీట్లలో ఒక్క సీటులోనూ అభ్యర్థిని పెట్టకుండా బీజేపీ పారిపోయింది వాస్తవం కాదా అని అన్నారు. ఆయుధాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందని మోదీ వ్యాఖ్యలపై పొన్నం ధ్వజమెత్తారు. అబద్ధాలకూ హద్దు ఉండాలని, ఆయుధాలు మనం ఇంకా దిగుమతి చేసుకుంటున్నామని స్పష్టంచేశారు. రాజకీయాల కోసం రక్షణ బలగాలను వాడుకున్న ద్రోహ చరిత్ర మీది కాదా? అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడానికి మన్మోహన్ సర్కార్ ౨౦౧౩లో రూ.౫౬౦౦ కోట్లు పెట్టుబడితో తీర్మానం చేసిందని గుర్తుచేశారు. ఆ ఫలితంగానే ౨౦౧౫లో ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులు మొదలయ్యాయని పొన్నం స్పష్టంచేశారు.

హుస్నాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తెస్తా

హుస్నాబాద్‌ను అభివృద్ది చేసి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెస్తానని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. అంతకు ముందు మండలంలోని పొట్లపల్లి గ్రామంలోని స్వయంభూ రాజరాజేశ్వర స్వామి, రేణుక ఎల్లమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.